వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ లబ్ది చేకూరుతుందని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం స్థానిక కర్నూలు రోడ్డులోని భారత్ పెట్రోలు బంకు వద్ద నుంచి 38వ డివిజన్లోని వాసవీ నగర్, సున్నపు బట్టీలు, శ్రీనివాస కాలనీ, గోవింద్ నగర్లో బాలినేని పర్యటించారు. నవ రత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే నగరంలోని అన్ని కాలనీల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రతి కుటుంబానికీ పింఛన్ల ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి 48 వేల దాకా లబ్ది చేకూరుస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. లక్ష నుంచి పది లక్షలదాకా సాయం అందించే ఏర్పాటు చేస్తామని బాలినేని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ పేద కుటుంబంలో పిల్లలను బడికి పంపినందుకు ఏటా రూ.15 వేలు అందిస్తామని చెప్పారు. ఇలా ప్రతీ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా ఏటా రూ.లక్ష నుంచి రూ. 5 లక్షలు లబ్ది పొందేట్లు జగన్ విధి విధానాలు అమలు చేస్తారని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నగర అధక్షుడు శింగరాజు వెంకట్రావు, డివిజన్ అధ్యక్షుడు ఆకుల మోహనరావు, పార్టీ నాయకులు వర్ధు శేషయ్య, సాయన అంజయ్య, సుబ్బారావు, రత్తయ్య, బి. రవణమ్మ పాల్గొన్నారు.