YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భవిష్యత్‌లో దేశంలో మూడే జీఎస్‌టీ రేట్లు

భవిష్యత్‌లో దేశంలో మూడే జీఎస్‌టీ రేట్లు

భవిష్యత్‌లో దేశంలో మూడే జీఎస్‌టీ రేట్లు ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు.  తాజాగా జైట్లీ దీనిపై మరిన్ని సంకేతాలిచ్చారు. జీఎస్‌టీలో అత్యధిక పన్ను శ్లాబు అయిన 28శాతాన్ని క్రమంగా తొలగిస్తామని, 12, 18శాతం శ్లాబులను కూడా తొలగించి వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.18 నెలల జీఎస్‌టీ పేరుతో రాసిన బ్లాగును జైట్లీ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. జీఎస్‌టీకి ముందు తర్వాత పన్ను విధానంలో వచ్చిన మార్పులను ఆయన ఇందులో వివరించారు. భవిష్యత్‌లో చేపట్టే ప్రణాళికలను కూడా పేర్కొన్నారు.‘జీఎస్‌టీకి ముందు చాలా వస్తువులపై 31శాతం అంతకన్నా ఎక్కువ పన్నులు ఉండేవి. దీనివల్ల పన్ను ఎగవేత ఎక్కువగా ఉండేది. సరకు రవాణా కూడా ఆలస్యమయ్యేది. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత 31శాతం అంతకంటే ఎక్కువ పన్నులున్న దాదాపు 200 రకాల వస్తువులను 28శాతం శ్లాబులో చేర్చాం. క్రమంగా అందులోని చాలా వస్తువులపై కింది శ్లాబుల్లోకి మార్చాం. సామాన్యులు వినియోగించే ఎన్నో నిత్యావసర వస్తువులను సున్నా, 5శాతం పన్ను శ్లాబుల్లోకి తెచ్చాం. అంతకుముందు 35-110శాతం ఉన్న సినిమా టికెట్లను 12-18 శాతం కిందకు తీసుకొచ్చాం. వీటి వల్ల పన్ను ఎగవేత చాలా వరకు తగ్గింది’‘ఇప్పుడు కేవలం విలాసవంతమైన వస్తువులు, సిమెంటు, డిష్‌వాషర్లు, ఏసీలు, పెద్దపెద్ద టీవీలపై మాత్రమే 28శాతం పన్ను ఉంది. నిత్యం వినియోగించే 1216 వస్తువుల్లో.. 183 రకాల వస్తువులపై ఎలాంటి పన్ను లేదు. 5శాతం శ్లాబులో 308, 12శాతం శ్లాబులో 178, 18శాతం శ్లాబులో 517 వస్తువులున్నాయి. త్వరలో సిమెంట్‌పై ఉన్న పన్నును కూడా తగ్గిస్తాం. 28శాతం శ్లాబు క్రమంగా పూర్తిగా తొలగిపోతుంది’‘భవిష్యత్‌లో జీఎస్‌టీని మరింత సరళీకృతం చేయనున్నాం. 12శాతం, 18శాతం శ్లాబులు కాకుండా వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం. ఆ రేటు 12, 18శాతాలకు మధ్యస్తంగా ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టొచ్చు. పన్ను చెల్లింపులు పెరిగిన దాని ప్రకారంగా ఈ పన్ను రేటును తీసుకొస్తాం. ఇకపై జీఎస్‌టీలో సున్నా, 5శాతం, ప్రామాణిక పన్ను రేటు మాత్రమే ఉంటాయి’ అని జైట్లీ తన బ్లాగులో రాసుకొచ్చారు.ఇటీవల జరిగిన 31వ జీఎస్‌టీ మండలి సమావేశంలోనూ చాలా వస్తువులపై పన్ను తగ్గించిన విషయం తెలిసిందే. 32 అంగుళాల టీవీలను 18శాతం శ్లాబులోకి మార్చారు. సినిమా టికెట్లపై కూడా పన్ను తగ్గించారు. 99శాతం వస్తువులను 18శాతం అంతకన్నా తక్కువ శ్లాబుల్లోకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల ప్రధాని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే.

Related Posts