హైదరాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం కొత్త అందాలను సంతరించుకుంది. ప్రతియేటా శీతాకాలంలో విడిదికి వచ్చే భారత ప్రథమ పౌరుడైన రాష్ట్రపతితో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా పచ్చందాలతో స్వాగతం పలుకుతోంది. దీనిలో భాగంగా కొత్తగా అటవీ శాఖ అభివృద్ది చేసిన రాక్ గార్డెన్, పామేరియం, జలపాతాన్ని రాష్ట్రపతి దంపతులు ప్రారంభించారు. కాండము లేకుండా ఆకులతోనే ఉండే పామ్ జాతికి చెందిన 30 రకాలతో మొక్కలతో ఏర్పాటు చేసిన పామేటమ్, నీటి అవసరం అంతగా లేని మొక్కల జాతులతో అభివృద్ది చేసిన రాక్ గార్డెన్, ఉన్న రాళ్ల మధ్యనే అందంగా తీర్చిదిద్దిన జలపాతాన్ని ప్రారంభించటంతో పాటు మొక్కలు నాటారు. గత పర్యటనకు వచ్చినప్పుడు హరితహారంలో పాల్గొని వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి, బొల్లారంలో ఉన్న 75 ఎకరాల్లో కూడా విరివిగా పచ్చదనం పెంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్దం చేసి పంపాలను ఆదేశించారు. ఆమేరకు ఐదు సూత్రాలను కూడా సూచించారు. ఉన్న చెట్లను తొలగించకుండా, జీవ వైవిధ్యం విలువ పెంచేలా కొత్తగా అభివృద్ది చేయటం, మొక్కలు లేని ప్రాంతాల్లో పెద్దవి నాటడం, సందర్శనకు వచ్చే పిల్లలు, పెద్దలకు మొక్కలపై అవగాహన పెరిగేలా బొల్లారం నిలయం ఉండాలని రాష్ట్రపతి సూచించారు. అటవీ శాఖ సిద్దం చేసిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసి మూడేళ్లకు కలిపి కోటీ డెభ్బైలక్షల రూపాయల నిధులను కూడా విడుదల చేశారు. ఆగస్టు నుంచి నాలుగున్నర నెలల కాలంలో ప్లాన్ ప్రకారం.. 20 రకాల థీమ్స్ తో.. వివిధ రకాల మొక్కలు అటవీ శాఖ నాటింది. దాదాపు75 ఎకరాల్లో మొత్తం 170 జాతులకు చెందిన 13, 714కొత్త మొక్కలను నాటారు... శీతాకాల విడిదిలో భాగంగా రోజూ మార్నింగ్ వాక్ లో అన్ని మొక్కలను రాష్ట్రపతి పరిశీలించారు. అటవీ అధికారులను పిలిచి, క్యాంపస్ లో కలియతిరుగుతూ పచ్చదనం అభివృద్ది పనులను పర్యవేక్షించారు. ఇంతకు ముందు ఎలా ఉంది, కొత్త మొక్కలు నాటిన తర్వాత ఇప్పడు ఎలా ఉందనే ఆల్బమ్ కూడా అటవీ శాఖ తయారు చేసి రాష్ట్రపతికి సమర్పించింది. అటవీ శాఖ పనితీరును స్వయంగా చూసిన రాష్ట్రపతి అధికారులను మెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారాన్ని కొన సాగించి పర్యావరణ పరంగా మంచి ఫలితాలు సాధించాలని, కొత్తగా ఎలాంటి పచ్చదనం చర్యలున్నా అహ్వానిస్తామని రాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీ.కే.ఝా, రఘువీర్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు శోభ, డోబ్రియల్, చంద్రశేఖర రెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ డీఎఫ్ఓలు వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.