అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఫెడరల్ ఫ్రంట్ దిశగా వేగం పెంచిన సీఎం కేసీఆర్.. వరస భేటీలతో బిజీబిజీగా గడుపుతన్నారు. ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా చేరుకున్న కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయంలో మమతతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. సమకాలీన రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్పై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు కోల్కతా చేరుకున్న కేసీఆర్కు ఆ రాష్ట్ర సచివాలయం వద్ద సీఎం మమతా బెనర్జీ ఘనస్వాగతం పలికారు. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ కోల్కతాలోని ప్రసిద్ధ కాళీమాత ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి బయల్దేరి వెళతారు. మంగళవారం నుంచి రెండు, మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27న ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్.. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో భేటీ కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులనూ కలవనున్నారు. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే లక్ష్యంగా భావసారూప్యత కల్గిన పలు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్న కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఒడిశా పర్యటన పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్ భువనేశ్వర్ నుంచి కోల్కతా నగరానికి చేరుకున్నారు