YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

'పోలవరంతో తెలంగాణకు ఎలాంటి ఇబ్బందీ లేదు’ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

'పోలవరంతో తెలంగాణకు ఎలాంటి ఇబ్బందీ లేదు’            ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తెలంగాణకు పోలవరం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని.. అయినా అడ్డంకులను సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చర్చించారో తెలీదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కేంద్రం శీతకన్ను వేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మే నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లందిస్తామని  ఆయన పునరుద్ఘాటించారు. పోలవరం పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన 2019 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 62.8శాతం పనులు పూర్తయ్యాయని చంద్రబాబు వెల్లడించారు. జనవరి 6-7 తేదీల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి రికార్డు సృష్టిస్తామన్నారు. స్పిల్ వే పనులు 75 శాతం పూర్తి అయ్యాయని.. ప్రాజెక్టులోని అన్ని డిజైన్లకు అనుమతులు వచ్చాయని సీఎం తెలిపారు. భూసేకరణకు రూ.33,235 కోట్లు ఖర్చు అవుతుందన్న సీఎం.. రూ.53,300 కోట్ల కొత్త డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాల్సి ఉందన్నారు. రూ.4వేల కోట్లతో విద్యుత్ కేంద్రం పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉందని చెప్పారు. ఒక్కసారి ప్రాజెక్టు ఆగితే మళ్లీ అడుగు ముందుకు పడదని, నిధులివ్వాల్సిన కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని సీఎం ప్రశ్నించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ఆసక్తిగా పనులు చేయిస్తున్నారన్నారు. మరోమారు ప్రధాని మోదీ, జలవనరుల శాఖ మంత్రి గడ్కరీకి లేఖలు రాస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ఉక్కు కర్మాగారం, రాజధాని అమరావతి నిర్మాణాలను.. రియల్ ఎస్టేట్ వ్యాపారమంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆరోపణలు చేస్తున్నారని, ప్రజా ప్రయోజనాల ఆయనకు కనిపించడంలేదని మండిపడ్డారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తాను మాట్లాడతానని, ఆ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రయోజనకారే అన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టునూ ఇంత త్వరగా పూర్తి చేస్తున్న దాఖలాలు లేవన్నారు.

Related Posts