YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడీకి బాబు నిరసన గుంటూరు నుంచి తెనాలికి పాదయాత్ర

మోడీకి బాబు నిరసన గుంటూరు నుంచి తెనాలికి పాదయాత్ర

మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు.  కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని నిరసనగా..సీఎం చంద్రబాబు గుంటూరు నుంచి తెనాలివరకు నిరసన పాదయాత్ర ఆరోజు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు సహకరిస్తున్న పార్టీలను సైతం దోషులుగా నిలబెట్టాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే 10 జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించామని తెలిపారు.‘కొత్త సంవత్సరం తొలిరోజు సంబరాలు చేసుకుంటాం.. అయితే వాటి బదులు మనకు జరిగిన అన్యాయంపై గళమెత్తాలి. మన ఐక్యతను చాటాలి. రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు నిరసన ప్రదర్శనలు జరగాలి. ప్రతి పల్లెలోనూ జనం కదం తొక్కాలి. ఆ రోజు ఎవరికి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో 2-3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీలు చేయాలి’ అని సూచించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న పార్టీల గుండెల్లో గుబులు పుట్టేలా ప్రజల్లో చైతన్యం రావాలని స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా ఆ రోజు నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మీదుగా 15-20 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరుపుతారని సమాచారం. పార్టీపరంగా అని కాకుండా.. ప్రజలే ముందుకొచ్చి ర్యాలీలు చేయాలని చంద్రబాబు కోరారు.‘ఒకరు నడుస్తూ వెళ్తుంటే కలిసొచ్చేవాళ్లు కలిసొస్తూ ఉంటారు. అదో ప్రవాహంలా మారుతుంది. జనాలను రాజకీయంగా తీసుకొచ్చి చేసే పనికాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా స్వచ్ఛందంగా అంతా కలిసిరావాలి. ఎవరికి వీలున్నచోట్ల వారు చేయాలి. ఓ 20 మందీ మొదలుపెడితే.. అలా నిరసన ర్యాలీ సాగుతుండగా మధ్యలో అనేకమంది స్వచ్ఛందంగా కలుస్తారు. చివరకు వెళ్లేసరికి భారీ ర్యాలీగా మారుతుంది. అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటే మళ్లీ అదే చేస్తారు. మోసం చేసినా మౌనంగా ఉంటే బలహీనత అనుకుంటారు. మళ్లీ అదేపని చేస్తారు. మోసం చేసినవాళ్లను నిలదీయాలి. అప్పుడే భయం ఉంటుంది’ అని చంద్రబాబు పార్టీ నేతలు, మీడియాతో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం, ఇతర హామీల అమలు కోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకే నూతన సంవత్సరం మొదటిరోజును ఎంచుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సంబరాలు మానుకుని..రాష్ట్రం కోసం ప్రజలు చైతన్యంగా ఉన్నారని నిరూపించే కార్యక్రమంగా ఇది మారాలని ఆకాంక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ నిరసన ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

Related Posts