తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శిచుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్కు రాష్ట్రంలో అపూర్వ స్పందన లభించిందని మంత్రి అన్నారు. 7,902 పోస్టులకు గాను 6.87లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. లోటుబడ్జెట్లో ఉన్నా విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఏపీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రధాని మోదీ గుంటూరు రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీదే ఘనవిజయమని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.