తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వరుస సెలవులు, క్రిస్మస్ పండుగకు తోడు ఏడాది చివరివారం కావడంతో మిగిలిపోయిన సెలవులను వినియోగించుకునేందుకు తరలివస్తున్న ఉద్యోగులతో ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తుంది. క్యూలైన్లు, ఉద్యానవనాలు, వసతి కేటాయింపు కేంద్రాలు, ఆలయ పరిసరాలు, కల్యాణకట్ట, అన్నదానం భవనం, లగేజీ సెంటర్లు, హోటళ్లు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ సందడి నెలకొంది. వసతి కోసం వివిధ సముదాయాల్లో లాకర్ల వద్ద భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కొందరు బయట రోడ్లపై, ఖాళీ స్థలాల్లో విశ్రమిస్తూ చలికి వణుకుతున్నారు. సర్వదర్శనం భక్తులు క్యూకాంప్లెక్స్ నిండి వెలుపల 2కిలోమీటర్ల పొడవున బయటకు వ్యాపించింది. లడ్డూ టోకెన్లు మంజూరు చేసే కాంప్లెక్స్ సైతం భక్తులతో నిండిపోయింది. సాధారణ సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు, స్లాటెడ్ దర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. పెద్దసంఖ్యలో వాహనాలు తరలిరావడంతో తిరుమలలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భక్తులకు టీటీడీ యంత్రాంగం నిరంతరాయంగా అన్నపానీయాలను వితరణ చేసింది. వారాంతం వరకు విపరీత రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.