కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల 'దేశవ్యాప్త సమ్మె' పిలుపు మేరకు జనవరి 8,9 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటి తెలిపింది. ఈ మేరకు సంఘం నాయకులు బస్‌భవన్‌లోని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీందర్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఐకాస ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మోటారు వెహికిల్ చట్టం (ఎంవీ యాక్ట్) సవరణ బిల్లుతో కార్మికుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ చర్యను కచ్చితంగా అడ్డుకుని తీరతామన్నారు. డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీలు తీవ్రంగా నష్టపోతున్నాయని, అందుకోసం పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రాజీరెడ్డి డిమాండ్ చేశారు. రవాణారంగ కార్మికులకు జీతాలు తక్కువ ఉన్నందున కనీస వేతనం రూ.24,000 చేయాలని కోరారు. సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కుల కోసం రెండు రోజుల సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు.