అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చామని అధికార తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ప్రచారం చేపడుతోంది. ఒకింత పనులు కూడా వేగంగా సాగుతుండటం గమనార్హం. వచ్చే ఏడాది కార్లు కూడా తయారీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దీన్ని పెద్దగా పట్టించుకోనట్టుగావున్న వైసిపి తాజాగా ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కియా కార్ల కంపెనీల భూముల్లో పెద్ద కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌లో ఈ ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇందులో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలపై నేరుగా ఆరోపణలు చేయడం గమనార్హం. మంత్రి పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులులు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి కియా అనుబంధ పరిశ్రమలకు ఎకరం రూ.2 కోట్లకు కొనే విధంగా ఒత్తిడి తెచ్చి లబ్ధిపొందారని ఆరోపించారు. అదే సమయంలో ధర్మవరం ఎమ్మెల్యే జి.సూర్యనారాయణతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా లబ్ధిపొందారని అందులో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ రూ.500 కోట్ల వరకు డబ్బులు పంచి గెలుపొందాలని చూస్తున్నారని కూడా చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ అంశాలపై ఇప్పటి వరకు జిల్లా వైసిపి నేతలెవరూ స్పందించిన దాఖలాల్లేవు. ఉన్నట్టుండి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో వైసిపి 14 నియోజకవర్గాలకు 12 వాటిల్లో టిడిపి గెలుపొందింది. రెండింటిలో మాత్రమే వైసిపి గెలుపొందినా ఒకరు తిరిగి టిడిపిలో చేరారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో చూసినప్పుడు అనంతపురం జిల్లాలోనే గత ఎన్నికల్లో వైసిపి అతి తక్కువ సీట్లు వచ్చాయి. తిరిగి రానున్న ఎన్నికల్లోనూ తమ పట్టును నిలుపుకునేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వైసిపి తమ బలాన్ని పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీపై విమర్శలు ఎక్కువ పెట్టినట్టు రాజకీయవర్గాల అభిప్రాయంగా ఉంది. అయితే విజయసాయిరెడ్డివి ఆధారాల్లేని ఆరోపణలని తెలుగుదేశం నాయకులు కొట్టిపడేస్తున్నారు. అయితే ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత చర్చనీయాంశమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.