కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ తొలి నుంచి తుమ్మితే ఊడిపోయే ముక్కులానే ఉంది. అసమ్మతి నేతలు ఇంతకాలం మంత్రివర్గ విస్తరణ కోసం వేచి చూశారు. అయితే అధిష్టానం ధీమా ఏంటో? రాష్ట్ర కాంగ్రెస్ నేతల వ్యూహం ఏంటో తెలియదు కాని సీనియర్ నేతలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టిందికర్ణాటకలోని సంకీర్ణ సర్కార్ ఏ నిమిషంలోనైనా కుప్పకూలడం ఖాయమనేలా సంకేతాలు కన్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగింది. మొత్తం ఎనిమిది మందికి విస్తరణలో అవకాశం కల్పించాయి. సీనియర్లకు మొండి చేయి చూపారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి రగిలిపోతోంది. బెళగావి ప్రాంతంలో పట్టున్న రమేష్ జార్ఖిహోళిని మంత్రి పదవి నుంచి తప్పించి కాంగ్రెస్ అసమ్మతికి మరింత ఆజ్యం పోసిందంటున్నారు. కుమారస్వామి కూడా దాదాపు చేతులెత్తేశారు. దైవం పైనే సర్కార్ భవితవ్యం ఆధారపడి ఉందన్న ఆయన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నెత్తికెత్తుకున్నారు. ఇక ముంచినా తేల్చినా సిద్ధూ యేనన్నది కాంగ్రెస్, జేడీఎస్ నేతల భావన.ఏడు సార్లు గెలిచిన రామలింగారెడ్డికి సయితం పదవి ఇవ్వడానికి నిరాకరించింది. బెంగళూరులో మంచి పట్టున్న నేత రామలింగారెడ్డి. సీనియర్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ కు కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో రగలిపోతున్నారు.డు రమేష్ జార్ఖిహోళి బీజేపీకి ఆయువుపట్టుగా మారతారన్న టాక్ విన్పిస్తుంది. రమేష్ జార్ఖిహోళి నుంచి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు తెలియంది కాదు. ఆయన మంత్రిపదవి ఊడిన నాటి నుంచి పది మంది సభ్యులతో మంతనాలు చేస్తున్నారన్న టాక్ కన్నడ నాట బలంగా విన్పిస్తోంది. పది మందితో కలసి బీజేపీలోకి జంప్ చేయడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అసంతృప్త నేతలను టార్గెట్ చేశారని సమాచారం. రమేష్ జార్ఖిహోళి మంత్రిగానే ఉంటూ గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతల అనుమానం. అయితే రమేష్ జార్ఖిహోళి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన బుజ్జగిస్తారన్న చిరు ఆశ కాంగ్రెస్ నేతల్లో మిగిలి ఉంది.బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పరిస్థితిని గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన వారికి తాము తప్పక ఆహ్వానం పలుకుతామని యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దాదాపు పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు బీజేపీ గుర్తించింది. వీరు ఖచ్చితంగా తమ దరిచేరతారన్న నమ్మకంతో ఉంది. అదే జరిగితే మరోసారి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎంతో దూరం లేదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు బహిరంగంగానే నిరసనకు దిగుతుండటంతో ఏవిధంగా వారిని అదుపు చేయగలరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది