YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడీ సభను బహిష్కరించాలి పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు

 మోడీ సభను బహిష్కరించాలి పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు
ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఎవరూ హాజరు కాకుండా నిరసన తెలపాలని టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.  బుధవారం నాడు అయన టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రధాని మోడీ పర్యటనకు గైర్హాజరు కావడమే తీవ్ర నిరసన అని అన్నారు. ప్రధాని గుంటూరు పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంటుందని అన్నారు.  అది బీజేపీ కార్యక్రమమేనని చెప్పారు.జనవరి 1న బిజెపికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆయన సూచించారు. మోడీ గుంటూరు పర్యటనపై జగన్, పవన్ ఎందుకు మాట్లాడరని, వైకాపా, జనసేన పార్టీలు ఎందుకు నిరసనలు చేయవని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకూ టిడిపి 10 ధర్మపోరాట సభలు నిర్వహిస్తే, ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఎపి విభజన గాయాలపై కారం పూయడానికే ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని  చంద్రబాబు విమర్శించారు.  రాష్ట్రానికి ప్రధాని మోడీ చేసింది ఏమీ లేదని, చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు. మోడీ చట్టంలో ఉన్నది చేయలేదని, హామీలు నెరవేర్చలేదని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధానిలో పనులను కాని, పోలవరం పనులను కాని చూసేందుకు వచ్చి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పరిశీలనకు కాకుండా పార్టీ కార్యక్రమాలకు రావడమే రాజకీయమని ఆయన చెప్పారు. ఎపి శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో వరుసగా 150 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపి సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి నేతలకు సూచించారు. టిడిపి నేతలతో చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రం కీలక దశలో ఉందని, అడ్డంకులు పెట్టేందుకు దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తనముందు ప్రధానంగా మూడు బాధ్యతలున్నాయని, ప్రజలు, ప్రభుత్వం, పార్టీ బాధ్యతలు తనపై ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ మూడు వర్గాలను సమన్వయం చేసుకోవాలని, ఎక్కడా ఎవరికీ చెడ్డపేరు రాకుండా అందరినీ కలుపుకొంటూ పని చేయాలని ఆయన అన్నారు.పార్టీ నేతలు జన్మభూమి, మా ఊరు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రణాళికల తయారీలో భాగస్వాములు కావాలన్నారు. నేతల పనితీరుపైనే రాష్ట్ర, వ్యక్తిగత భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పారు.నాలుగున్నరేళ్లలో మనం చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజల్లో భరోసా పెంచాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

Related Posts