వస్తు సేవల పన్నుపై భాజపా ప్రభుత్వ ప్రకటిత లక్ష్యాల మార్పునకు కారణమేంటని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘నిన్నటి వరకు జీఎస్టీలో ఒకే ప్రామాణిక రేటు చెత్త ఆలోచన. ఇప్పుడేమో ప్రభుత్వ ప్రకటిత లక్ష్యం! నిన్నటి వరకు జీఎస్టీకి 18 శాతం పరిమితి విధించడం అసాధ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అయిన 18 శాతం పరిమితి ప్రభుత్వ ప్రకటిత లక్ష్యం! నిన్నటి వరకు ప్రామాణిక రేటు 15 శాతం ఉండాలన్న ప్రధాన ఆర్థిక సలహాదారు నివేదిక బుట్టదాఖలు. నిన్ననే దాన్ని బయటకు తీసి ఆర్థిక మంత్రి బల్లపై ఉంచారు. ఇప్పుడు దానికి ఆమోదం!’ అని చిదంబరం వరుస ట్వీట్లు చేశారు.త్వరలో జీఎస్టీలో ఒకే ప్రామాణిక రేటు ఉండే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు రోజుల క్రితం ప్రకటించారు. అత్యంత విలువైన కొన్ని వస్తువులపై మాత్రమే 28 శాతం పన్ను రేటు విధిస్తామన్నారు. 12, 18 శాతం రేట్లను సవరించి మధ్యలో ఒక కొత్త ప్రామాణిక రేటును ప్రవేశపెట్టొచ్చని సూచించారు. తన ఫేస్‌బుక్‌లో కథనం రాశారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఓడిపోవడంతోనే ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యాల్లో మార్పులు వస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.