దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలోని బోగీబీల్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసిన అప్పటి ప్రధాని దేవెగౌడను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నన్నెవరు గుర్తు పెట్టుకుంటారు..?’ అని అసహనం ప్రకటించారు.బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దేవెగౌడను బోగీబీల్ వంతెను గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. వంతెన ప్రారంభోత్సవానికి మీకు ఆహ్వానం వచ్చిందా? అని అడగగా.. ‘అయ్యో రామ! నన్నెవరు గుర్తు పెట్టుకుంటారు? బహుశా కొన్ని వార్తాపత్రికల్లో ఈ విషయాన్ని ప్రస్తావించొచ్చు’ అని సమాధానమిచ్చారు. ‘నేను ప్రధానిగా ఉన్న సమయంలో కశ్మీర్‌కు రైల్వే లైను, దిల్లీ మెట్రో, బోగీబీల్ వంతెన ప్రాజెక్టులను మంజూరు చేశాను. శంకుస్థాపన కూడా చేశాను. ఈ రోజు ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక బోగీబీల్ వంతెన ఆలస్యంపై స్పందించిన దేవెగౌడ.. ‘హసన్-మైసూరు ప్రాజెక్టును 13 నెలల్లోనే పూర్తిచేశా. మరో రెండు వంతెనలను కూడా చెప్పిన సమయంలోనే నిర్మించాం. అయినా దేవెగౌడ ఏం చేయలేదని కొందరు అంటున్నారు. అలా అనే వారంతా నేను పూర్తిచేసిన వంతెనల వద్దకు వెళ్లి చూడండి’ అని చెప్పుకొచ్చారు.బోగీబీల్ వంతెనకు 1997లో ప్రధానిగా ఉన్న దేవెగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో నాటి ప్రధాని వాజ్‌పేయీ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన వంతెన నిర్మాణం ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత పూర్తయ్యింది.