టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 3 నుండి 10వ తేదీ వరకు శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జనవరి 3వ తేదీన బూర్జ మండలం పి.ఎల్.దేవిపేట గ్రామంలోని శ్రీరామలవారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. జనవరి 4న శ్రీకాకుళం మండలం మాలమనయ్యపేటలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. జనవరి 5న సిగడం మండలం పాలఖండ్యాం గ్రామంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది. జనవరి 6న శ్రీకాకుళం పట్టణంలోని ఎన్.టి.ఆర్. మున్సిపాల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కల్యాణం నిర్వహించనున్నారు. జనవరి 7న సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలోని శ్రీ బాలాజి పార్వతమ్మ పెరంటాల క్రీడా ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. జనవరి 8న పొందూరు మండలం కోటిపల్లి గ్రామంలోని గ్రామదేవత ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
తూర్పు గోదావరి జిల్లాలో జనవరి 6న ఆత్రేెయపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో కల్యాణం నిర్వహించనున్నారు. జనవరి 7వ తేదీన రావులపాలెం మండలం కేంద్రంలోని శ్రీ మురళి రామాలయ ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. - జనవరి 8న ఆలమూరు మండలం నర్శిపూడి గ్రామంలోని శ్రీ శివాలయం ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. జనవరి 9న మారేడుమిల్ల్లి మండలం కోడురు గ్రామంలోని శ్రీ రామాలయం ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది. జనవరి 10న గంగవరం మండలం ఏటిపల్లి గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ప్రభాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.