వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘హేపీనెస్’ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. భూటాన్‌లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఇటీవల డిల్లీలో కూడా ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్ధులకు చదువుపై ఆసక్తి పెంపొందించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం అనుసరిస్తున్న బోధనా విధానంలో కొన్ని లోపాలు ఉండటం వల్ల బోధన పద్ధతుల్లో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఎలాంటి విసుగు లేకుండా ఉండే విధంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురానున్నారు. విద్యార్ధులపై వత్తిడి తగ్గించడం, పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఆ విధంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకోల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులను కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం. అలాగే ఉపాధ్యాయుల బోధనా పద్ధతుల్లో కూడా మార్పులు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకోల్పడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్ధులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నూతన పద్ధతుల్లో బోధనలకు శ్రీకారం చుట్టనున్నారు.