సొంత పార్టీ కార్యకర్తలకే సమాధానం చెప్పలేక మోదీ చేతులెత్తేశారు. మోదీ తీరుతో విపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్లయ్యింది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు బీజేపీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్యకర్తలతో ప్రధాని మోదీ నేరుగా లైవ్‌లో మాట్లాడే కార్యక్రమం మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిదశలో తమిళనాడు, పుదుచ్చేరి కార్యకర్తలతో మోదీ నేరుగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తన ఆలోచనా విధానాన్ని వారితో పంచుకున్నారు. ఆ కార్యక్రమం జరుగుతుండగా, పుదుచ్చేరీకి చెందిన ఒక కార్యకర్త వేసిన ప్రశ్న మోదీని, బీజేపీని ఇరకాటంలో పడేసింది. పన్నులు వసూలు చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ప్రజా సంక్షేమంలో లేదని నిర్మల్ కుమార్ జైన్ అనే పాండిచ్చేరి పార్టీ కార్యకర్త మోదీని నిలదీశారు.దేశంలో మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నం మంచిదే. మధ్యతరగతి వర్గం ఆలోచన వేరుగా ఉంది. మీ ప్రభుత్వం కేవలం పన్నుల వసూలుపైనే దృష్టి పెట్టింది. ప్రజలకు మీరు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు అంటూ కార్యకర్త నిలదీశారు. కార్యకర్త స్వయంగా నిలదీయడంతో మోదీ నీళ్లు నమిలారు. మాట దాటవేస్తూ మరో కార్యకర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. మధ్యతరగతి వర్గానికి, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలరో మోదీ చెప్పలేకపోయారు. దీనితో మోదీపై సెటైర్లు వేస్తు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వణక్కం పుదుచ్చేరి అంటూ చేసిన ట్వీట్లో మోదీ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటి దాకా మీడియాతో మాట్లాడేందుకే భయపడిన మోదీ, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా భయపడాల్సి వస్తోందని రాహుల్ అన్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయలేదని గుర్తు చేస్తూ.... జనంలో కనిపించేందుకు కూడా భయపడే రోజులు వచ్చాయన్నారు. మోదీపై మధ్యతరగతి వర్గం ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందన్నారు.కార్యకర్తలతో లైవ్ షోలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ప్రధాని కార్యాలయం నేరుగా రంగంలోకి దిగింది. ఇకపై పీఎంతో లైవ్‌లో మాట్లాడే కార్యకర్తలను తామే ఎంపిక చేస్తామని బీజేపీకి తెలిపింది. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రశ్నలు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి ప్రధానికి ఇబ్బంది లేని ప్రశ్నలనే ఆమోదిస్తారు. ఆ ప్రశ్న అడిగే కార్యకర్త పేరు, వయసు, పార్టీలో అతని క్రియాశీలత, పార్టీ నాయకత్వం పట్ల అతని కున్న అంకితభావం ఆధారంగా లైవ్‌లో మాట్లాడే అవకాశమిస్తారు. అభ్యంతరకరమైన వ్యక్తులను, వారు అడగబోయే ప్రశ్నలకు అడ్డుకోవాలని తీర్మానించారు. పుదుచ్చేరి సంఘటన తమకు గుణపాఠమని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. తర్వాత ఈశాన్య రాష్ట్రాల కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ ఉన్నందున జాగ్రత్తగా ఉండకపోతే పరువు పోతుందని భయపడుతున్నారు.