ఆంధ్రప్రదేశ్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీతో విడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ఎవరు ఏ పార్టీలో చేరిపోతారో కూడా తెలియక.. అక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధికార పార్టీపై ఎదురుదాడికి దిగాలని భావిస్తున్న బీజేపీ నేతలు.. సీఎంతో సహా అందరు నేతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ధీటుగానే టీడీపీ నేతలు కూడా సమాధానమిస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం పరిస్థితుల్లో ఒక్క ఏపీలోనే కాదు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అందుకే ఆ పార్టీకి ప్రతి రాష్ట్రం ఎంతో ముఖ్యమైనది. కాబట్టే అన్ని రాష్ట్రాల్లో పర్యటించాలని మోదీ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. జనవరి ఆరున ఆయన రాష్ట్రంలోని రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం మోదీకి నిరసన సెగను చూపించాలని భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బీజేపీకి చెందిన ఓ నేత చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రమేష్‌నాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని మోదీ పర్యటనలో రాష్ట్ర ప్రజలు తీపి కబురు వింటారని వెల్లడించారు. అయితే, అది ప్రత్యేక హోదా గురించో, ప్రత్యేక ప్యాకేజీ గురించో చెప్పలేదు కానీ, శుభవార్త మాత్రం వినడం పక్కా అని బల్లగుద్ది చెప్పాడు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ ఆ శుభవార్త ఎంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సంచలన విషయం బయటికొచ్చింది. ఈ విషయంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. ఏపీ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ జయంతి రోజో.. ఆయన వర్థంతి రోజో.. మహానాడు సమయంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ డిమాండ్ కూడా ఎవరూ చేయడంలేదు. అందుకే దీనిని తమ ప్రభుత్వం చేసి, ఏపీ ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలని మోదీ గ్యాంగ్ భావిస్తున్నట్లు టాక్.