YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓటమి మోదీ-షాల గుత్తాధిపత్యానికి చెక్

మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓటమి మోదీ-షాల గుత్తాధిపత్యానికి చెక్
ఇటీవల రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయం చవిచూడటం - రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తతుండటంతో పార్టీలో మోదీ - షా ద్వయం గుత్తాధిపత్యానికి కాస్త గండిపడినట్లే కనిపిస్తోంది. విజయం సాధించినప్పుడు తమదే ఘనత అన్నట్లుగా భుజాలు ఎగరేసుకునేవారు పరాజయానికి బాధ్యత ఎందుకు తీసుకోరంటూ సీనియర్ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మోదీ - షాల వైఖరికి వ్యతిరేకంగానే గడ్కరీ అలా మాట్లాడారన్నది బహిరంగ రహస్యం.పార్టీ వరుస విజయాల నేపథ్యంలో ఇన్నాళ్లూ మోదీ - షాలను ఏమీ అనలేకపోయిన ఆరెస్సెస్ పెద్దలు కూడా తాజా పరాజయం నేపథ్యంలో తమ గళం పెంచుతున్నారు. విజయాలను తమవిగా చెప్పుకునే ఆ ఇద్దరూ పరాజయానికి బాధ్యత వహించకపోవడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా అమిత్ షాను లక్ష్యంగా చేసుకొని వారు విమర్శలు సంధిస్తున్నారు.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతానికి పార్టీలో - ప్రభుత్వంలో మోదీ స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదు. బీజేపీ తరఫున - ఎన్డీయే తరఫున వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే ప్రధాని అభ్యర్థిగా నామినేట్ అవడం ఖాయం. కానీ - అమిత్ షా స్థానానికే సంఘ్ పెద్దలు ఎసరు పెడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన మూడు రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యత వహించాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొందరు సంఘ్ పెద్దలైతే షాకు ప్రత్యామ్నాయాన్ని కూడా సూచిస్తున్నారు. ఆయన స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. షా సేవలను పార్టీలో కాకుండా పార్లమెంటులో ఉపయోగించుకోవాలని ప్రతిపాదిస్తున్నారు.  దాదాపు నాలుగున్నరేళ్లుగా బీజేపీలో నరేంద్ర మోదీ - అమిత్ షా ద్వయానిదే హవా. పార్టీలో వారికి ఎదురుచెప్పేవారే లేరు. బీజేపీని కను సైగలతో శాసించగల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) పెద్దలు కూడా మోదీ - షాలను ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ ద్వయం నేతృత్వంలో పార్టీ సాధించిన అద్భుత విజయం అందుకు కారణం. ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం విజయ పరంపర కొనసాగించడంతో మోదీ - షాలకు తిరుగులేకుండాపోయింది. మరి వారి డిమాండ్లపై షా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

Related Posts