ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం మోదీ జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పర్యటించాల్సి ఉంది. ముందుగా తిరువనంతపురంలో జరిగే సభలో పాల్గొని అనంతరం ఏపీ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. అయితే సభను తిరువనంతపురంలో కాకుండా శబరిమల సమీపంలోని ‘పట్టణంతిట్టా’కు మార్చాలని ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే జరిగితే ప్రధాని అనుకున్న సమయానికి కేరళ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోలేరని ఏపీ బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జనవరి 6న గుంటూరులో జరగాల్సిన సభ వాయిదా పడక తప్పదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేరళలో సభ నిర్వహణ ప్రాంతంపై ఒకటి,రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని, దీనికి అనుగుణంగానే మోదీ ఏపీ పర్యటనకు వస్తారా? లేక వాయిదా వేసుకుంటారా? అన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ పర్యటనను ఏపీ సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవడంతో ప్రధాని మోదీ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయని మోదీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని నిలదీస్తున్నారు. ప్రధాని హోదాలో మోదీ వచ్చినా తాను కలవనని ఆయన ఇంతకుముందే సీఎం ఖరాఖండిగా చెప్పేశారు. ప్రధాని పర్యటనకు దూరంగా ఉండటమే తమ నిరసన అని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు విభజన గాయంపై కారం పూయడానికే మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, ఏపీ ప్రజలకు ఏం చేశారని చెప్పడానికి వస్తున్నారని ప్రశ్నించారు.