అసమ్మతి నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతలు తమతో పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం… అసంతృప్త నేతలు అందుబాటులోకి రాకపోవడం కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కు ముప్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి మరింత హెచ్చుమీరింది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం అగ్రనేతలను రంగంలోకి దించింది. అయినా అసమ్మతి నేతలు ససేమిరా అంటున్నారు. తమకు మంత్రి వర్గ విస్తరణలో అన్యాయం జరిగిందంటూ గట్టిగానే చెబుతున్నారు.మంత్రి వర్గ విస్తరణ అనంతరం చెలరేగిన అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి కె.సి. వేణుగోపాల్ అందరినీ కలసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే అసంతృప్త నేతల్లో ఎక్కువ మంది మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రధాన అనుచరులు కావడంతో ఆయనకు బుజ్జగింపుల బాధ్యతను అప్పగించారు. అయినా సిద్ధరామయ్య మాట కూడా వినడం లేదు. సిద్ధరామయ్యపై తమకు గౌరవం ఉందని, ఆయన మాటను కూడా అధిష్టానం పట్టించుకోవడం లేదని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు.ప్రధానంగా సీనియర్ నేతలు రామలింగారెడ్డి, రమేష్ జార్ఖిహోళి నుంచే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. వీరిద్దరినీ బీజేపీ నేతలు కలవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే సీనియర్ నేత బి.సి. పాటిల్ కూడా తన దారి తాను చూసుకుంటానని సంకేతాలిస్తున్నారు. వీరితో భేటీ అయ్యేందుకు సిద్ధరామయ్య, వేణుగోపాల్ లు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదని తెలుస్తోంది. వీరితో భేటీకి కొందరు విముఖత వ్యక్తం చేయగా, మరికొందరు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కాంగ్రెస్ నేతలకు దడ పుట్టిస్తున్నారు.రెండు రోజుల్లో అసమ్మతి నేతలు తమ శిబిరానికి రావడం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. వారం రోజుల్లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఢిల్లీ పర్యటన కూడా కన్నడ నాట హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో అసమ్మతి పెల్లుబుకిన నేపథ్యంలో నిన్న కుమారస్వామి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిశారు. రాహుల్ ను కూడా కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణ తదనంతర పరిణామాలపై కుమారస్వామి రాహుల్ తో చర్చించనున్నారు. తనను సంప్రదించకుండా తన రాజకీయ కార్యదర్శిగా కాంగ్రెస్ నేత మునియప్పను నియమించడాన్ని కుమారస్వామి, దేవెగౌడ తప్పుపడుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో కమలం పార్టీ వేచి చూస్తుండగా, కాంగ్రెస్ ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ బిక్కు బిక్కుమంటోంది