ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్లకు వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మేలో ‘జన్మభూమి- మాఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతే కాకుండా మీకోసం, ప్రజాదర్బార్, ఆర్టీజీఎస్ (రియల్ టైం గవర్నెన్స్), 1100 కాల్ సెంటర్, మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వీరిలో కొంతమంది దరఖాస్తులను పరిశీలించి మండల కేంద్రం నుంచి అంతర్జాలంలో అప్‌లోడ్ చేసి జిల్లా శాఖకు పంపించారు. జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కల్ల్లుగీత కార్మికులు, హిజ్రాలు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు 2,83,567 మంది ఉన్నారు. వీరికి నెలకు ప్రభుత్వం రూ.30.67 కోట్లు వెచ్చిస్తుంది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంలో నియోజకవర్గానికి 2,000 వేల చొప్పున జిల్లాకు 18,000 పింఛన్లు మంజూరు చేసింది. వీటిలో కొన్ని నియోజకవర్గ పరిధిలోనికి, మిగిలిన వాటిని వేర్వేరు నియోజకవర్గాలకు బదలాయించారు. అప్పటి నుంచి నేటివరకు ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో అర్హులు పైన తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు అధికారులు లెక్కల ప్రకారం వివిధ రకాల పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారు 16,250 మంది ఉన్నారు. అర్హులైన ప్రతిఒక్కరి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీరికి పింఛన్లు మంజూరవ్వాలంటే ప్రభుత్వం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం నిర్వహించి ఇస్తారా... లేదా నేరుగా మంజూరు చేస్తారో చూడాల్సిన పరిస్థితి ఉందని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతానికి మత్స్యకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలకే ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుంది. జిల్లాలోని మత్స్యకారులు 740, ఒంటరి మహిళలు 1,200 మందికి పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా సెర్ఫ్ నుంచి అనుమతులు రాగానే అందిస్తున్నారు. డప్పు కళాకారులు జిల్లాలో రెండు వేలకు పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి దగ్గర నుంచి సంక్షేమశాఖ అధికారులు దరఖాస్తులు సేకరించి అర్హులందరికీ మంజూరు చేస్తున్నారు. వీరికి సంబంధించి నిధులు సామాజిక సంక్షేమశాఖ నుంచి మంజూరు చేయడం జరుగుతోంది. పింఛన్ల పంపిణీ¨ మాత్రం డీఆర్డీఏ అధికారులు చేపట్టనున్నారు. పైన తెలిపిన ప్రకారం ఎవరైనా ఉంటే ఇప్పుడైనా ఆయా మండల కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.