దేశ రాజకీయాల్లో నూతన ఆలోచనలకు పునాది పడింది. ముఖ్యంగా రాష్ట్రంలో యువత చైతన్యవంతమవుతోంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా అత్యంత ప్రజాదరణ పొందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ కొత్త ఆలోచనలతో రాజకీయాల్లోకి ప్రవేశించడం శుభ పరిణామం. తెల్లారిపాటికి ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. గత చరిత్ర పరిశీలిస్తే విధి నిర్వహణలో ఆయన అత్యంత సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. స్థిత ప్రజ్ఞుడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి, ప్రజానికం ఆలోచనలలో తాను అనుకున్న మార్పు తీసుకురావడానికి సమయం పడుతుందని ఆయనకు తెలుసు. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, తన లక్ష్యానికి చేరుకోవడానికి దీర్ఘ కాలం పడుతుందన్న స్పష్టత ఆయనలో ఉంది. అందుకు సిద్ధపడే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ నాయకులు అందరూ ఒకే రకంగా చెబుతారని, అందులో కొత్తగా వచ్చేవారు ఇంకాస్త అతిగా చెబుతారని అందరూ అనుకోవడం సహజం. వారు అలా అనుకోవడానికి తగిన అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే లక్ష్మీనారాయణ ఆలోచనల్లో కొత్తదనం ఉంది. ఆయన మాటల్లో నిజాయితీ ఉంది. సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న తపనతో తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి వచ్చారు. ఆచరణ సాధ్యమైన విషయాలే చెబుతున్నారు. ముఖ్యంగా త్వరగా ఏదో ఒక పదవి చేపట్టాలన్న కాంక్ష ఆయనకు లేదు. ముందు ప్రజల ఆలోచనా విధానంలోమార్పు రావాలి. దానికే ఆయన ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో నిజాయితీగా పని చేసుకుపోవాలన్నదే ఆయన ఉద్దేశం. లక్ష్య సాధన దానంతట అదే సాధ్యమవుతున్నది ఆయన అభిప్రాయం.లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ స్థాపించే క్రమంలో అవినీతి లేని సమాజం, రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం గ్రామస్థాయి నుంచే పునాది వేస్తున్నారు. అది ఆయన పార్టీ కోసం వేస్తున్న పునాది అయినప్పటికీ వ్యవస్థలో మార్పుకు నాందిగా భావించవచ్చు. రాజకీయంగా ముందుకు వచ్చినప్పటికీ ఏదైనా పార్టీలో చేరడానికి గానీ, పార్టీ పెట్టడానికి గాని ఆయన తొందరపడటంలేదు. ముఖ్యంగా తాను ఏం చేస్తానో చెబుతానని, వ్యక్తిగత విమర్శలు చేయనని, అంశాల వారీగా తన విమర్శలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇది జనానికి కొంత ఊరట కలిగించే అంశం. 2025 నాటికి దేశంలో 75 శాతం మంది యువకులు ఉంటారు. ఆ యువతకు సరైన మార్గం చూపిస్తే అద్వితీయమైన అభివృద్ధి మన ముందు సాక్షాత్కారమవుతుందన్నది ఆయన నమ్మకం. రైతులు సబ్సిడీలు ఇవ్వమని, రుణాలు రద్దు చేయమని ప్రభుత్వాన్ని అడగని స్థాయికి తీసుకువెళ్లాలన్నది ఆయన కల. అవినీతి లేని వ్యవస్థ – రాజకీయాల్లో జీరో బడ్జెట్ పాలసీ – కుల, మతాలకు అతీతంగా రాజకీయాలు, అభివృద్ధి - పీపుల్స్ పాలసీ –వృత్తుల వారీగా పాలసీలు - సమగ్ర గ్రామీణాభివృద్ధి - ప్రతి గ్రామానికి ఓ మేనిఫెస్టో – జిల్లా స్థాయి వ్యవసాయ విధానం – సర్వే నెంబర్ ఆధారంగా పంటల బీమా – వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు- గ్రామాలకు పూర్వ వైభవం - యువతకు ఉపాధి – రాజకీయాలతోపాటు అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత - మద్యం తాగని గ్రామాల దత్తత – దశలవారీగా మద్యపాన నిషేధం - ప్లాస్టిక్ వాడకంపై నిషేధం వంటివి ఆయన చెప్పేవాటిలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.ప్రతి పార్టీ గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆయన కూడా గ్రామం నుంచే మొదలు పెడుతున్నారు. అయితే రాజకీయ పార్టీలు, కులాలు, గ్రూపులుగా విడిపోయిన గ్రామస్తులందరూ కలిసి తమ గ్రామానికి ఏం కావాలో ఆలోచించి ప్రతి గ్రామానికి ఓ మేనిఫెస్టో తయారు చేసుకోవాలి. ఓటు అడగడానికి వచ్చిన నేతలతో ఆ మేనిఫెస్టోపై సంతకాలు చేయించాలి. అవకాశం ఉంటే వంద రూపాయల స్టాంప్ పేపర్ పై రాసి సంతకం చేయించుకోవాలి. గెలిచిన ప్రజా ప్రతినిధిని ఆ మేనిఫెస్టోని అమలు చేయమని డిమాండ్ చేయాలి. ఆయన చెప్పేవాటిలో ప్రధాన అంశం ఇదే. ఓటుని అమ్ముకుంటే ప్రశ్నించే, డిమాండ్ చేసే హక్కుని కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. అసాధ్యం అనేది లేదన్నది ఆయన అభిప్రాయం. తానుఅత్యంత ప్రమాదకరమైన ఆశావాదినని చెబుతారు. అంటే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలనన్న ప్రగాఢమైన విశ్వాసం ఆయనలో ఉంది. ప్రజా పాలసీని రూపొందించి రాజకీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జాయిన్ ఫర్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ స్థాపించారు. తన ఆలోచనలు, విధానాలు, లక్ష్యాలు తెలియజేస్తూ, అలాగే గ్రామస్తులు తమ గ్రామానికి ఏం కావాలో తెలియజేయడానికి 9 పేజీల మేనిఫెస్టోని ‘అవర్ విలేజ్ మేనిఫెస్టో.ఆర్గ్’ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ధనం,కులాలకు అతీతంగా తన రాజకీయ ప్రయాణం ఉంటుందని, అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ఆలోచనా విధానమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అవినీతి అనేది వ్యసనం లాంటిదని, దానిని అంతం చేయడానికి దీర్ఘకాలం పడుతుందని, అందుకు కావలసినంత ఓపిక తన వద్ద ఉందని చెప్పారు. తన ఆలోచనలు, భావాలు వెల్లడించానని, భావసారూప్యత కలిగిన పార్టీలతో కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాంటి అవకాశం లేని పక్షంలో సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. బీజేపీ వారు కొందరు ఆయనను ఆహ్వానిస్తున్నారు. లోక్ సత్తా పార్టీ పగ్గాలు చేపట్టమని జయప్రకాష్ నారాయణ ఆయనను స్వయంగా కోరారు. అయితే ఆయన ఇతర పార్టీలలో చేరే అవకాశాలు చాలా తక్కువ. సొంతంగా పార్టీ పెట్టడమే ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మేథోమథనం జరుగుతోంది. కొత్త ఆలోచనలకు తెర తీసిన లక్ష్మీనారాయణ త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.