మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ జీవిత అంశాలతో తెరకెక్కించిన చిత్రం ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. 2004 నుంచి 2008వరకు మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల కాగా.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది.పార్టీని కాదనలేక, దేశానికి ద్రోహం చేయలేక ప్రధానిగా మన్మోహన్ పడిన వేదనను.. సోనియా, రాహుల్ గాంధీల గురించి కొన్ని వివాదాస్పద అంశాలను చూపించడంతో పాటు ఈ ట్రైలర్‌ను చూడండంటూ బీజేపీ ట్వీట్ చేసింది. దీంతో నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో బీజేపీ ఇలా బురద జల్లే పని పెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ పీఎల్ పునియా విమర్శించారు.ఇలా తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మోదీ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రశ్నించకుండా ఉండదని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాపై స్పందించడానికి మన్మోహన్ సింగ్ నిరాకరించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన మన్మోహన్ సినిమాపై మాట్లాడేందుకు నిరాకరించారు.