YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫ్లాష్ బ్యాక్..ఏపీ రాజకీయాలు.. కొత్త బంధాలకు దారి తీసిన 2018

ఫ్లాష్ బ్యాక్..ఏపీ రాజకీయాలు.. కొత్త బంధాలకు దారి తీసిన 2018
మరికొద్ది రోజుల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరం ప్రవేశించబోతున్నాం. 2018కి వీడ్కోలు పలికి.. 2019కు ఘన స్వాగతం చెప్పబోతున్నాం. పాత సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటేనే.. కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకునేందుకు సిద్ధం కాబోతున్నాం. 2019కు స్వాగతం పలికే ముందు.. 2018లో జరిగిన కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో ముఖ్యమైన ఘట్టాలను ఓసారి గుర్తు చేసుకుందాం.2018లో జరిగిన అతిపెద్ద రాజకీయ నిర్ణయం టీడీపీ ఎన్డీఏకు కటీఫ్ చెప్పడం. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమయ్యిందంటూ.. తెలుగు దేశం పార్టీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. 2108 మార్చి నెలలో కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా చేశారు. అలాగే రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఇద్దరు బీజేపీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లు పదవులకు గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి మంచి మిత్రులు కాస్తా శత్రువులుగా మారారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయంటూ ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పోరును మరింత ఉధృతం చేసింది. దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించింది. కేంద్రం స్పందించకపోతే ఆఖరి అస్త్రంగా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అధినేత చెప్పినట్లుగానే.. ఆ పార్టీ ఎంపీలు తమ పదవులకు 2018 ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. అనంతరం హోదా కోసం దీక్ష చేపట్టారు. జూన్‌లో వారి రాజీనామాలకు స్పీకర్ ఆమోదం తెలిపారు.కేంద్రం అన్యాయం చేసిందంటూ ఎన్డీఏ నుంచి వైదొలగిన టీడీపీ ధర్మపోరాట దీక్ష పేరుతో నిరసన మొదలు పెట్టింది. జిల్లాలవారీగా బహిరంగ సభలతో హోరెత్తించింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం అన్యాయం చేసిందంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకల్ని కూడా చేసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు. ధర్మపోరాట దీక్షలతో పాటూ సైకిల్ ర్యాలీలను చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య సంచలనం రేపింది. సెప్టంబర్‌లో విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం తొట్టంగి దగ్గర.. గ్రామ దర్శిని కార్యక్రమానికి వెళుతున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు అడ్డగించారు. ఇద్దర్ని అతి దారుణంగా కాల్చి చంపారు. 
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కత్తి దాడి కూడా ఈ ఏడాదిలో సంచలనం రేపింది. అక్టోబర్‌ 25న హైదరాబాద్ వచ్చేందుకు విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో వేచి ఉన్న జగన్‌పై అక్కడే పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాసరావు కత్తి తీసుకొని దాడి చేయడం కలకలంరేపింది. ఈ దాడిలో ప్రతిపక్ష నేత భుజానికి గాయమయ్యింది. తర్వాత ఈ దాడి వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. టీడీపీ-వైసీపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. దాడి చేసిన శ్రీనివాసరావు.. మీ పార్టీకి చెందిన కార్యకర్త అంటే.. మీ పార్టీకి చెందిన కార్యకర్త అంటూ రెండు పార్టీల నేతలు దుమ్మెత్తి పోసుకున్నారు. తర్వాత ఈ కేసు పంచాయితీ హైకోర్టుకు కూడా చేరింది. 
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఈడీ దాడులు సంచలనం రేపాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు, నేతల ఇళ్లు, కంపెనీల్లో సోదాలు జరిగాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీలను టీడీపీ కక్షసాధింపమని మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలో ఉన్న బీజేపీ ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి దాడులకు బయపడేది లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీయేతర కూటమి ప్రయత్నాలను ఈ ఏడాదిలోనే ప్రారంభించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని సంస్థలను నాశనం చేస్తోందంటూ.. ప్రతిపక్షాలను ఏకతాటిపై తెచ్చే పనిని భుజాలపై వేసుకున్నారు. టీడీపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను కలిసి కొత్త రాజకీయానికి తెర తీశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సంకేతాలు పంపారు. 

Related Posts