YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముహర్తాలు, సెంటిమెంట్లపై బాబు.. కేసీఆర్ ఫార్ములాలో ఏపీ సీఎం

ముహర్తాలు, సెంటిమెంట్లపై బాబు.. కేసీఆర్ ఫార్ములాలో ఏపీ సీఎం
చంద్రబాబు.... కేసీఆర్ ఫార్ములానే ఫాలో అవుతున్నారా...అదేంటి? అనుకుంటున్నారా.. ! నిజ‌మే! టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇప్పుడు తెలంగాణా సీఎం కేసీఆర్ మాదిరిగా మారుతున్నార‌ట‌! కేసీఆర్ బాట‌లోనే న‌డవాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే, ఏ పాల‌న‌లోనో.. ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలోనో అయితే.. పరవాలేదు .. మ‌ళ్లీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి.. చంద్ర‌బాబు.. ప‌క్క రాష్ట్రం సీఎంను ఫాలో అవుతున్నార‌ని అనుకుని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం కేసీఆర్ బ‌లంగా న‌మ్మే  సెంటిమెంట్లు, ముహూర్తాల విష‌యంలో ఆయ‌న‌నే ఫాలో అవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజాగా వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఇప్పుడు అమ‌రావ‌తి వ‌ర్గాలు కూడా ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నాయి. ప్ర‌పంచాన్ని గెలిచాన‌ని చెపుతున్న చంద్ర‌బాబు ఇప్పుడు ముహూర్తాలు, ముల‌క్కాయ అంటూ.. జ‌పం చేస్తుండ‌డంపై విస్తుపోతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలే సమయం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జాబితా విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలిసింది. ఇది ధనుర్మాసం.. సంక్రాంతికి నెలరోజుల ముందు వరకూ శుభ ముహూర్తాలు ఉండవంటారు. జనవరి 17వ తేదీవరకు కూడా శుభలగ్నాలు లేవట. అయితే ఈలోగా అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు ఏపీ సీఎం. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన ఎప్పుడో వెల్లడించారు. ఇందుకు ఆయన నెలరోజుల నుంచే కసరత్తులు ప్రారంభించారు. పార్టీ అంతర్గత సర్వేలు, గూఢచారి నివేదికలు, స్వతంత్ర సంస్థల సర్వేల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించారు. అన్ని నివేదికలను క్రోడీకరించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చేశారని తెలిసింది. జనవరి 17 తరవాత ఓ మంచి ముహూర్తాన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించారు. తద్వారా అసంతృప్తులను బుజ్జగించడానికీ, అవసరమైతే వారికి నచ్చజెప్పడానికీ సమయం దొరికింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి అసంతృప్తుల బెడద అంతగా లేదు. అందరి సహకారం ఉండటంతో అభ్యర్థుల గెలుపు సులువు అయింది. ముందుగా పార్టీ టిక్కెట్లు ప్రకటిస్తే చాలదు- అభ్యర్థి గుణగణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనికి తోడు చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్ బాట‌లోనే ముహూర్తాలు చూసుకుని జాబితా విడుద‌ల చేస్తుండ‌డంపై త‌మ్ముళ్లే ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ముహూర్త బ‌లం చంద్ర‌బాబు కు ఏమేర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి

Related Posts