YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతపురంలో జేసీకి గురునాధరెడ్డి షాక్

 అనంతపురంలో జేసీకి గురునాధరెడ్డి షాక్
అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగలనుంది. తాను పట్టుబట్టి మరీ పార్టీలోకి తీసుకువచ్చిన నేత పార్టీకి గుడ్ బై చెబుతుండటం జేసీకి తలనొప్పిగా మారనుంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి కొన్నాళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకురావడానికి పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని భావించిన గురునాధరెడ్డి జేసీ మాట విని అమరావతికి వచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. నెలలు గడుస్తున్నా తాను చేరినప్పుడు ఇచ్చిన హామీలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నెరవేర్చలేదు. జేసీ దివాకర్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరిని దెబ్బకొట్టడానికే గురునాధరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే. జేసీకి,ప్రభాకర్ చౌదరికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబుకు ప్రభాకర్ చౌదరి ఫిర్యాదు కూడాచేశారు. గురునాధరెడ్డిని పార్టీలో చేర్చుకునే ముందు కూడా ఆయన చంద్రబాబు వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే గురునాధరెడ్డిని పార్టీలోకి తీసుకువస్తున్నామని చెప్పడంతో ప్రభాకర్ చౌదరి మిన్నకుండి పోయారు.ఆ తర్వాత ప్రభాకర్ చౌదరికి, గురునాధరెడ్డికి మధ్య సయోధ్య కుదరలేదు. దీనికి తోడు పార్టీలో చేరుతున్నప్పుడు టీడీపీ అధిష్టానం అనంతపురం అర్బన్ డెవెలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఇంతవరకూ దానిపై అతిగతీ లేదు. ఈ పదవిని గురునాధరెడ్డికి ఇస్తే ఇంతకాలం పనిచేసిన నేతలు ఏమై పోతారని అనంతపురం జిల్లా నేతల నుంచి ప్రశ్నలు ఎదురుకావడంతో చంద్రబాబు ఆ పదవిని భర్తీ చేయకుండా పక్కనపెట్టారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా గురునాధరెడ్డికి ఆహ్వానాలు లేవు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు. దీనికితోడు జిల్లా పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి హవా కూడా క్రమంగా తగ్గుతోంది.గురునాధరెడ్డి రేపు పార్టీని వీడాలన్న యోచనకు వచ్చారు.  టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఇంకా సందిగ్దత నెలకొని ఉంది. ఆయన తిరిగి వైసీపీలోకే వెళ్లనున్నారన్న ప్రచారం మాత్రం బాగానే జరుగుతోంది. అనంతపురం నియోజకవర్గంలో పట్టున్న గురునాధరెడ్డి వర్గం మొత్తం పార్టీని వీడితే టీడీపీకి భారీ దెబ్బతగలనుంది. వైసీపీ నుంచి రాయదుర్గం టిక్కెట్ ఇస్తామన్న సంకేతాలు రావడంతోనే ఆయన వైసీపీలోకి వెళుతున్నారన్న వాదనా ఉంది. మరోవైపు జనసేన పార్టీలో చేరతారన్న వదంతులూ విన్పిస్తున్నాయి. మొత్తం మీద గురునాధరెడ్డి పార్టీని వీడటం ఇటు వ్యక్తిగతంగా జేసీకి, అటు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి

Related Posts