విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ ఉన్న పాత రికార్డులు, ఫర్నీచర్ వెంటనే తరలించాలని, హైకోర్టుకు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలని, న్యాయమూర్తుల బస, రవాణాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖలకు సిఎస్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీచేశారు.కోర్టు నిర్వహణకు కీలకమైన సిబ్బంది రెండు బస్సుల్లో హైదరాబాద్ నుండి బయలుదేరారు. మరోవైపు తగిన సమయం ఇవ్వకుండా హైకోర్టు విభజన చేశారని వాదిస్తున్న హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. విభజన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కూడా వారు ఆందోళన కొనసాగించారు. ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఉత్తర్వులు విడుదల కావడంతో తాను చేసేదేమి లేదని ఆయన చెప్పడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో జనవరి ఒకతో తేది నుండి విజయవాడలోనే హైకోర్టు నడవనుంది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న సివిల్ కోర్టు భవనాలు పూర్తయ్యే వరకూ విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలోనే కోర్టులు నడవనున్నాయి. ఎనిమిది కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు కోర్టులూ అదనంగా అవసరమవుతాయని, వాటినీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సివిల్ కోర్టు భవనాలనూ వినియోగించుకోనున్నారు. చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ జనవరి ఒకటో తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇతర న్యాయమూర్తులు కూడా అదే సమయంలో ప్రమాణం చేయనున్నారు. సిబ్బందికి అవసరమైన వసతి కార్యాలయాలను కోర్డు అవరణలోనే ఖాళీ స్థలంలో నిర్మించాలని సూచించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ను సంప్రదించి కంప్యూటర్ సదుపాయాలు కల్పించాలని ఐటిశాఖను ఆదేశించారు. ఆఫీసు కోసం ఎంజి రోడ్డులోని ఆర్‌అండ్‌బి భవనంలో 10వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. దీనికి వీలుగా భవనాన్ని ఖాళీ చేయాలని, అదనంగా ఉన్న సామాగ్రిని గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన తాత్కాలిక ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సిఆర్‌డిఏకు సూచించారు. హైకోర్టు జడ్జిలు, రిజిస్ట్రార్‌కు నోవాటెల్‌లో వసతి కల్పించనున్నారు. ఇతర జడ్జిలకు నగరంలోని వేర్వేరు హోటళ్లలో, సిబ్బందికి స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో బస కల్పించారు. జడ్జిలకు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలని డిజిపికి సూచించారు. మొత్తం 12 విల్లాలు ఏడాది లీజు కాలపరిమితితో తీసుకోవాలని సిఆర్‌డిఏకు సూచించారు. మరోవైపు హైకోర్టు పూర్తిస్థాయి కార్యాక్రయాలు ఫిబ్రవరి 22 నుండే జరుగుతాయన్న అభిప్రాయాన్ని న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పళంగా వెళ్లమంటే పాత రికార్డులు మొత్తాన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదని, ఈ నేపథ్యంలో రెండు లేదా మూడు రోజులు నిర్వహణ ఉంటుందని, అనంతరం సంక్రాంతి సెలవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ లోపు రాజధాని పరిధిలో ఉన్న సివిల్‌కోర్టు భవనాలు సిద్ధమవుతాయని,జగన్ కేసులను దృష్టిలో పెట్టుకొని విభజన చేసిన్నట్లు ఉందని సిఎం వ్యాఖ్యానించారు. విచారణ పూర్తవుతున్న సమయంలో బదిలీ చేస్తే, విచారణ మరలా మొదటికి వస్తుందని అన్నారు. హైకోర్టుతో పాటు సిబిఐ కోర్టు విభజన జరుగుతుందని చెప్పారు. హైకోర్టు విభజన జరగాలని తాను లేఖ ఇచ్చానని, కానీ సమయం లేకుండా విభజిస్తే ఎలా అని ప్రశ్నించారు. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత నెల రోజుల సమయమన్నా ఇవ్వకుండా ఐదు రోజుల్లోనే ఉద్యోగులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్రంపై రాష్ట్రాలకు నమ్మకం పోతోందని వ్యాఖ్యానించారు.