YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ విదేశాల ఖర్చు 2021 కోట్లు

మోడీ విదేశాల ఖర్చు 2021 కోట్లు
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చుల వివరాలను పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. 2014 జూన్‌ నుంచి ఇప్పటి వరకూ మోదీ విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాలు, వాటి నిర్వహణ, వసతి సదుపాయాల ఏర్పాటుకు రూ.2,021 కోట్లు ఖర్చుచేసినట్టు రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. 2014 నుంచి 2018 డిసెంబరు వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో ప్రకటించారు. నాలుగేళ్ల 7 నెలల్లో 48 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన మోదీ 92 దేశాల్లో పర్యటించారు (ఒకే దేశంలో రెండు సార్లు పర్యటించినవి సహా). వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు మరో రెండు దేశాల్లో పర్యటిస్తే ఇందిరా గాంధీ తర్వాత అత్యధికంగా విదేశాల్లో పర్యటించిన రెండో ప్రధానిగా మోదీ రికార్డులకెక్కుతారు. ఇప్పటి వరకు ఇందిరా గాంధీ 113 దేశాల్లో పర్యటించి తొలి స్థానంలో ఉండగా, 93 విదేశీ పర్యటనలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ పదేళ్లలో 93 దేశాల్లోనూ, ఇందిరా గాంధీ పదిహేనేళ్లలో 113 దేశాల్లో పర్యటించగా, కేవలం నాలుగున్నరేళ్లలోనే మోదీ 92 దేశాలు చుట్టివచ్చారు. మోదీ కంటే ముందు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్ విదేశీ పర్యటనలకు 2009 నుంచి 2014 వరకు రూ.1,346కోట్లు ఖర్చైందని తెలిపారు. కాగా 2014 నుంచి 2018 వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ.2021కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. మోదీ 2014 మే నుంచి 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను సందర్శించారని వెల్లడించారు (వీటిలో కొన్ని దేశాల్లో రెండుసార్లు పర్యటించారు). అయితే, మోదీ పర్యటనల ఖర్చు రూ.2,021 కోట్లు అయినా, మన్మోహన్ సింగ్ సగటుతో పోల్చితే తక్కువే అయినట్టు పేర్కోవడం గమనార్హం. మోదీ ఒక్కో దేశం వెళ్లడానికి సగటున రూ.22 కోట్లు ఖర్చయితే, మన్మోహన్‌కు సగటున రూ.27 కోట్లు ఖర్చయ్యిందని తెలిపారు. మోదీ పర్యటన ఖర్చుల్లో అత్యధికంగా 2015 ఏప్రిల్ 9 నుంచి 17 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలకే రూ.31.25 కోట్లు అయ్యిందని, తర్వాత 2014 నవంబరు 11 నుంచి 20 వరకు మాయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజిలకు రూ.22.58 కోట్లు అయ్యిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక, మోదీ విదేశీ పర్యటనల జాబితాలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందిస్తున్న తొలి పది దేశాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని వీకే సింగ్‌ వెల్లడించారు. విదేశీ పెట్టుబడులు 2014లో 30,930.5మిలియన్‌ డాలర్ల రాగా, 2017లో 43,478.27మిలియన్‌ డాలర్ల వచ్చాయని తెలిపారు.

Related Posts