ఈ ఏడాది సెప్టెంబరులో వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద గ్రామస్థులకు, ఆయన శిష్యులకు మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలూ ఒకరుపై ఒకరు దాడిచేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ విషయంలో గ్రామస్థులకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలకు అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. తమ సొంత మైలేజీ కోసం పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తానంటూ సీఐ హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదో అలవాటుగా మారిందని, ప్రతి విషయంలోనూ పోలీసుల మీద నోరుపారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా అంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు సీఐ. అయితే, తాజాగా సీఐ మాధవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కదిరి అర్బన్ సీఐగా ఉన్న మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు సమాచారం. త్వరలోనే ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారమే తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీకి అందజేసినట్టు సమాచారం. జేసీ దివాకర్ రెడ్డితో వివాదం కారణంగా మాధవ్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. మీసం తిప్పి మరీ జేసీకి ఆయన సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాలుగా పోలీసు శాఖలో ఉన్న మాధవ్ అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాతే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.