సుస్థిర అభివృద్ధి సేవా రంగం నుంచి మాత్రమే సాధ్యమని, సేవారంగం మీద దృష్టి కేంద్రీకరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, అందువల్ల సేవారంగంమీద దృష్టి కేంద్రీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశమందిరంలో కలెక్టర్ల సదస్సును ప్రారంభించారు. సేవారంగంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం సాధ్యమవుతుందన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ దిశగా పనిచేయాలని ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపుణేఠాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తే అక్కడ సందర్శకులు బసచేయడానికి సరిపడా గదులు లేవని గుర్తు చేశారు. రానున్న కాలంలో సేవారంగంలో లక్ష గదులు అందుబాటులోకి తేవాలని పర్యాటక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందితే మన రాష్ట్రానికి తిరుగు ఉండదని, వృద్ధిలో దూసుకుపోతామని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్ధి కనిపిస్తున్నదని, అయితే సేవారంగంలో ఇంకా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామ జిల్లా స్థాయిలలో ప్రణాళికల రూపకల్పనకు సమాయత్తం కావాలని ఆదేశించారు. సాధించిన అభివృద్ధిని, సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలను బేరీజు వేసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేయడానికి శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నామని, ఇంకా వచ్చే 3 రోజులలో శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నిర్ణీత లక్ష్యాల సాధనకు సానుకూల దృక్పధం కలిగి ఉండాలన్నారు.
పండుగలా ఆరో విడత జన్మభూమి-మా ఊరు
ఆరో విడత ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాన్ని గ్రామగ్రామానా, ప్రతి వార్డులో పండగ వాతావరణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇప్పుడు విడుదల చేసిన 7, విడుదల చేయనున్న 2 శ్వేతపత్రాలపై జనవరి 2 నుంచి నిర్వహించే జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పెద్దఎత్తున చర్చ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పది రోజులలో గ్రామీణ ప్రజానీకానికి ప్రభుత్వం సాధించిన విజయాలపై అవగాహన కల్పించాలన్నారు.
గ్రామస్థాయి సూక్ష్మ ప్రణాళికలను వెల్లడించడానికి ఈ సభలే వేదికలుగా నిలుస్తాయని, జన్మభూమి-మా ఊరు కార్యక్రమం తర్వాత విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని అన్నారు. పెట్టబడి లేని ప్రకృతి సేద్యంపై రైతాంగంలో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జన్మభూమి గ్రామ సభలలో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం అవగాహన కల్పించాలన్నారు.
ఎయిర్ షో పర్మిషన్ రద్దు అత్యంత దుర్మార్గం
ఎయిర్షో చివరి నిమిషంలో విత్ డ్రా చేశారంటే కేంద్రం ఎంత కక్షగా వ్యవహరిస్తున్నదో అర్ధం అవుతోందని ముఖమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఎయిర్ షో కు ముందుగా అనుమతించి చివరిలో ఎందుకు అనుమతి రద్దు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సింది
కొద్ది నీటితోనే అనంత’ అద్భుతాలు
కేంద్రం సహకరించకున్నా మన కష్టంతో 10.52% గ్రోత్ రేటు వచ్చిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. వ్యవసాయ ఉద్యానంలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉందని, ఇచ్చిన కొద్ది నీటితోనే అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన రంగంలో అద్భుత ఫలితాలు సాధించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాయలసీమలో నీళ్లను సక్రమంగా వినియోగించుకుంటే సీమ రానున్న రోజులలో హార్టీకల్చర్ హబ్గా మారుతుందని చెప్పారు. ఉద్యానంలో పెట్టుబడులు తక్కువ, ఫలితాలు ఎక్కువని, రాయలసీమలోని నాలుగు జిల్లాలు రానున్న కాలంలో ప్రాథమిక రంగంలో ప్రధమంగా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.
నాలుగైదు సంవత్సరాలలో నీరు, ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎన్ని సమస్యలు వచ్చేవో ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది. కేవలం పట్టిసీమ వల్ల నీళ్లు ఇవ్వడం వల్లనే అనేక సమస్యల నుంచి గట్టెక్కగలిగామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆక్వాలో ప్రకాశం వెనుకంజ
కాలుష్య ప్రభావం, నీరు లేకపోవడం కారణాలుగా ఆక్వా కల్చర్లో ప్రకాశం జిల్లా వెనుకబడి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నీళ్లు ఉన్నాయని, తీర ప్రాంతం ఉందని, అభివృద్ధికి వీలైన వాతావరణం ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో అభివృద్ధి సాధ్యం కావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతిని సాంకేతికతతో చాలావరకు నియంత్రించగలిగామని, అవినీతి నిర్మూలనలో మూడవ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. సాంకేతికత, జవాబుదారి విధానాల వల్లనే అవినీతి రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటంలో ఒక రోల్ మోడల్గా ఉండగలిగిన విషయాన్ని వివరించారు.
175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎం పార్కులు
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్లు, ఉత్తమ విజ్ఞాన భాగస్వాములను తీసుకొచ్చి ‘మెడ్ టెక్ పార్కు’ను ఒక అత్యుత్తమ నమూనాగా నిలిపిన విధానం అద్భుతమని ప్రశంసిస్తూ 175 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఇదే భావనతో అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. 200 ఎకరాలలో ఆర్ అండ్ డీ, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెటింగ్, వేర్ హౌసింగ్ తదితర సదుపాయాలతో దేశానికి ఒక నమూనాగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మన రాష్ట్రానికి ఉత్తమ మానవ వనరులు ఉన్నాయని, సహజ వనరులకు కొదవలేదని, నైపుణ్యం, తెలివితేటలు ఉన్నాయని చెబుతూ ఒక సానుకూల వాతావరణం నెలకొల్పడానికి తగిన వసతులు మనకు ఉన్నాయని సీఎం చెప్పారు. ‘హబ్ అండ్ స్పోక్’ పద్ధతిలో ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయనున్నామన్నారు.
వృద్ధి రేటులో అగ్రగామి మన రాష్ట్రం
నాలుగేళ్లుగా వరుసగా వృద్ధి ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి జాతీయస్థాయి కంటే ఎక్కువగా వృద్ధి ఫలితాలను సాధిస్తూ వస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వర్షాభావం వల్ల వృద్ధిలో తగ్గుదల కనిపిస్తోంది. వనరులు పుష్కలంగా ఉన్నా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకా కొంత వెనుకబడి ఉన్నాయన్నారు.
అర్హులందరికీ జన్మభూమి-మా ఊరులో ఇళ్ల మంజూరు
జనవరి రెండో తేదీనుంచి జరిగే ఆరో జన్మభూమిలో ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని అర్హులకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించిన తర్వాత రహదారులు, మురుగుకాల్వలు లాంటి మౌలిక సదుపాయాల కోసం వెనక్కి తిరిగి చూసుకోకూడదని, అన్ని సదుపాయాలతో పేదల గృహ సముదాయాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.
రేషన్ దుకాణ సేవలు మెరుగుపర్చాలి: ముఖ్యమంత్రి ఆదేశం
రేషన్ పంపిణీపై గత 2నెలల్లో ప్రజల్లో కొంత అసంతృప్తి రావడంపై సమావేశంలో చర్చ జరిగింది. తూకంలో, డీలర్ వ్యవహార శైలిపై కార్డుదారుల్లో అక్కడక్కడా అసంతృప్తి ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రేషన్ పంపిణీపై ప్రజల్లో సంతృప్తి అనుకున్నంత పెరగలేదని ముఖ్యమంత్రి అన్నారు. బినామీలు రేషన్ దుకాణాలు నడపడం, రేషన్ కోసం పదేపదే డిపోల చుట్టూ తిరగడం,డీలర్ ప్రవర్తనపై, సరుకులు తూకంపై, రశీదులు ఇస్తున్నారా లేదా అనే అంశాలపై సర్వే ఫలితాలను ముఖ్యమంత్రి వివరించారు.
డీలర్లకు చెల్లింపులు సక్రమంగా చేయండి. రేషన్ సరిగ్గా పంపిణీచేసేలా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. రేషన్ సరుకుల పంపిణీలో అత్యధిక సంతృప్తి కలిగిన జిల్లాలలో కృష్ణా జిల్లా 85%, పశ్చిమ గోదావరి జిల్లా 84%, గుంటూరు జిల్లా 84%తో వరుస స్థానాల్లో నిలిచాయి. అత్యల్ప సంతృప్తి జిల్లాల్లో అనంతపురం 76%, శ్రీకాకుళం 76%, కర్నూలు 76% తో ఉన్నాయి. పౌరుడు ఒకడే, ప్రభుత్వం ఒకటే, శాఖలే వేర్వేరని, సమన్వయంతో అన్ని శాఖలూ ఏకోన్ముఖంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కొత్తరేషన్ కార్డుల కోసం 21,564 దరఖాస్తులు
ఇదిలా ఉంటే పౌరసరఫరాల్లో 88% సంతృప్తితో రాష్ట్రంలోనే ముందున్న మండలాలల్లో ఉయ్యూరు, పాలకొల్లు, తెనాలి నిలిచాయి. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 21,565 దరఖాస్తులు రాగా, అందులో 14,414 దరఖస్తులను ఆమోదించామని, 4,538 దరఖాస్తులను తిరస్కరించామని, 12.1% మాత్రమే పెండింగ్లో ఉందని రాజశేఖర్ అన్నారు. ఏడాదిలో ప్రతినెలా వేలిముద్ర పడని వాళ్ల జాబితా రూపొందించాలని, డోర్ డెలివరి చేయాలని కోరారు. బయో మెట్రిక్ లో లోపాలు, ఐరిస్ లో లోపాల వల్ల కార్డుదారులకు ఇబ్బందులు ఉండకూడదని, ఇలాంటివి ఏమన్నా ఉంటే నాలుగైదు శాతం కూడా ఉండదని, అటువంటి లోపాలు కూడా నివారించాలన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని, అదే సమయంలో లబ్దిదారులతో వారి ప్రవర్తన ఎలా వుందనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రేషన్ పారదర్శకంగా పంపిణీ చేయాలని, అవకతవకలకు కళ్లెం వేయాలని, అదే సమయంలో ఏ ఒక్క కార్డుదారుడికి ఇబ్బంది పెట్టరాదని, సాంకేతిక సమస్యలతో కార్డుదారులకు ఇబ్బంది పెట్టకూడదని ముఖ్యమంత్రి కోరారు. వచ్చే నెలలో రేషన్ పంపిణీలో 90% సంతృప్తి ప్రజల్లో రావాలన్నారు. వచ్చే ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో స్ప్లిట్ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఇదిలా ఉంటే 17,15,571 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, రైతులకు రూ.2640కోట్లు చెల్లింపులు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు.