ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దీక్ష విరమణ కోసం భారీ సంఖ్యలో భక్తులు బెజవాడకు తరలివస్తున్నారు. ఐదు రోజులపాటు దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా. శుక్రవారం నుంచి జనవరి 2 వరకు దీక్షల విరమణ కొనసాగనుంది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు మహా మండపం సమీపంలో అగ్ని ప్రతిష్టాపన, ఇరుముడి, శుభహోరా ప్రారంభమయ్యాయి. దసరా తర్వాత అమ్మవారి ఆలయంలో జరిగే రెండో అతిపెద్ద కార్యక్రమం దీక్షల విరమణ కావడం విశేషం. దీక్షల విరమణకు తోడు కొత్త ఏడాది వస్తుండటంతో.. అమ్మవారి దర్శనం కోసం రద్దీ పెరగనుంది. భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2000 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు భవానీ మాలధారణ కార్యక్రమం ఉంటుంది. నాటి నుంచి 41 రోజులపాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. మండల దీక్ష ముగిశాక కృష్ణా నదిలో స్నానం చేసి అమ్మవారికి ఇరుముడి సమర్పిస్తారు.