YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైద్యం హరీ...!

 వైద్యం హరీ...!
ప్రభుత్వాలు ఆరోగ్య పథకాల పేరిట రూ.కోట్లు నిధులను కేటాయిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వైద్యసహాయం పొందడానికి ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు అక్కడ సరైన వైద్యం అందక అప్పులు చేసి కార్పొరేట్‌ వైద్యశాలలకు వెళ్లాల్సిన దుస్థితి పట్టింది. ఏ వైద్యశాలలో కూడా తగినంత మంది వైద్యులు, ఆధునిక వసతులు, పడకలు లేక కష్టాలు పడుతుంటే పాలకులుగానీ, అధికారులుగానీ పట్టించుకోక చివరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.
పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే రహదారిలో ప్రాంతీయ వైద్యశాలను నిర్మించారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా ఉండే దీనిని 100 పడకలతో ప్రాంతీయ వైద్యశాలగా స్థాయిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు కాగితాలకే పరిమితం తప్ప ఆచరణలో శూన్యమని చెప్పాలి. 50 పడకలుకాదు కదా కేవలం ఇక్కడ 36 పడకలు మాత్రమే ఉన్నాయి. ఈ ఆసుపత్రి పెద్దాపురం పట్టణం, మండలం, జగ్గంపేట, గండేపల్లి, రంగంపేట, సామర్లకోట తదితర మండలాలకు చెందిన సుమారు 450 మంది అవుట్‌ పేషంట్లు వైద్యం కోసం వస్తుంటారు. ఇన్‌పేషెంట్లకు పడకలు సరిపోక మంచాలను వరండాల్లో పెట్టి వైద్యం చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి సుమారు 8 మంది వైద్యులు ఉండాలి. అటువంటిది ముగ్గురు ఉన్నారు. ఇందులో ఒక వైద్యుడిని డిప్యుటేషన్‌పై రాజమహేంద్రవరానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేవలం ఇద్దరే వైద్యులే ఉన్నారు. ఇద్దరు వైద్యులు అంత మంది అవుట్‌ పేషెంట్లను చూడాలి.  వైద్యుల పరిస్థితి ఇలా ఉంటే లేబొరేటరీలో శాశ్వత సిబ్బంది లేరు. గతంలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగ విరమణ చేయడంతో ప్రస్తుతం ఒప్పంద టెక్కీషియన్స్‌ రక్తం, మూత్రం వంటి పరీక్షలు చేస్తున్నారు. అత్యవసర కేసులు, పెద్దాపురం నుంచి రంగంపేట వెళ్లే ఏడీబీ రోడ్డులో రోడ్డు ప్రమాదాల కేసులు వస్తే తాత్కాలిక వైద్యం చేసి కాకినాడకు తరలిస్తున్నారు. దీంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అత్యవసర కేసులను తరలించాలంటే ఆసుపత్రిలోని అంబులెన్స్‌ మరమ్మతులతో షెడ్డుకు చేరింది. దీని గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. పాలకులు మాత్రం చక్కటి వైద్యసేవలు అందిస్తున్నామంటూ ప్రసంగాలు చేస్తున్నారు తప్ప వాస్తవంగా చూస్తే ఇక్కడ సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదు. రహదారి ప్రమాదాల కేసులు వస్తే వారికి వైద్యసహాయం చేయాలంటే ఆర్థోపెడిక్‌ వైద్యుడు ఉండాలి. ఇక్కడ అటువంటి ఆధునిక వైద్యులు లేరు. పేరుకు 24 గంటల వైద్యశాల తప్ప పేదలకు సరైన సౌకర్యాలు అందడం లేదు. అటు పాలకులు, ఇటు ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంతో పేదలకు ఆశించినంత వైద్యం అందడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts