YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాగుల వ్యధ

వాగుల వ్యధ
పశ్చిమకృష్ణా పరిధిలోని తిరువూరు, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లోని కట్లేరు, తమ్మిలేరు, మునేరు, రామిలేరు, బుడమేరు, పాలేరు, ఎదుళ్ల, విప్ల, తూర్పు, పడమటి వాగులకు వరదాయినులుగా పేరుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ప్రారంభమయ్యే వాగులు ఎక్కువ భాగం కృష్ణా జిల్లాలోనే ప్రవహిస్తుంటాయి. భారీవర్షాలు, తుపాన్ల స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చి చేరే వరదతో పరవళ్లు తొక్కుతుంటాయి. కొన్ని సందర్భాల్లో నదులను మరపిస్తుంటాయి. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోకపోవడంతో పరివాహక ప్రాంతం ఆక్రమణలతో కుచించుకుపోయింది. వాగులకు అడ్డుగా ఆనకట్టలు లేకపోవడంతో ఏటా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోంది. 
వర్షాకాలంలో నిండుగా ప్రవహించే వాగులు కాస్త ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వట్టిపోతున్నాయి.  ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే వాగుల్లో నీటి ప్రవాహం జాడ కనిపిస్తోంది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన భూములు సాగునీటి ఎద్దడి పరిస్థితుల్లో బీళ్లుగా  మారుతున్నాయి. అతివృష్ఠి సమయంలో వాగుల గమనం గతితప్పి ఉద్ధృతంగా ప్రవహిస్తూ పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లో భూములు కోతకు గురవుతున్నాయి. రెండు రకాలుగా రైతులు పంట నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సమీకృత వాటర్‌ షెడ్ల అభివృద్ధి పథకం కింద తమ్మిలేరు, కట్లేరు పరివాహక ప్రాంతంలోని 28,353 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదటి విడతగా రూ.34.02 కోట్లతో అభివృద్ది. చేయడానికి నీటియాజమాన్య సంస్థ అధికారులు  అంచనాలు రూపొందించారు. ప్రతిపాదనలను గ్రామీణాభివృద్ధిశాఖ రాష్ట్ర కమిషనర్‌కు పంపించారు. నివేదికను కేంద్రానికి పంపి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ప్రతి ఏటా నివేదికలు పంపిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. 
పశ్చిమకృష్ణా పరిధిలో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లతోటలు, పామాయిల్‌ వంటి పంటలు సాగు చేస్తారు. నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట మండలాల్లో చెరువులు, సాగర్‌ కాలువలతో పాటు వాగులు సైతం ప్రధాన సాగునీటి వనరులుగా ఉన్నాయి. భూగర్భ జలమట్టాల హెచ్చుతగ్గులపై ఇవి ప్రభావితం చేస్తుంటాయి.  వర్షాధారంపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 2.08 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. సుమారు 50 వేల హెక్టార్లలో ఏడు ప్రధాన, చిన్నచితకా మరో 12 వాగులు రైతుల సాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యాంలు, ఆనకట్టలు, విద్యుత్తు మోటార్ల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నారు. తిరువూరు, గంపలగూడెం మండలాల పరిధిలోని కట్లేరు, పడమటి వాగుపై ప్రవాహానికి అడ్డుగా ఐదు ఆనకట్టలు నిర్మించడానికి రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ప్రతిపాదనల నివేదిక రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కనీసం ఈ నిధులు రాబట్టేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది. 
అనుసంధానిస్తే ప్రయోజనం  వాగుల పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురికావటం, ముళ్లపొదలు, తుప్పలు పెరగటంతో కుంచించుకుపోయాయి. వర్షాలు, తుపాన్ల సమయంలో భారీగా వచ్చి చేరే వరదనీరు ప్రహించటానికి సామర్థ్యం చాలక భూములు ముంపునకు గురవుతున్నాయి. కోతకు గురికావడం, ఇసుక మేటలు వేస్తూ కడగండ్లను మిగుల్చుతున్నాయి. గతంలో పలకరించిన వాటితో పాటు ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఇదే చేదు అనుభవం  ఎదురైంది. 
కట్లేరు, పడమటి వాగులపై ఖమ్మం జిల్లా ముత్తగూడెం, తిరువూరు మండలం కోకిలంపాడు సమీపంలో ఆనకట్టలు నిర్మించి తవ్విన కాలువలను 14 చెరువులకు అనుసంధానం చేసి నీటిని మళ్లిస్తున్నారు. దీంతో చెరువుల ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకుంటున్నాయి. *చాట్రాయి మండలం పోలవరం వద్ద తమ్మిలేరుపై నిర్మించిన ప్రాజెక్టు సైతం వేలాది ఎకరాల భూములకు సాగునీటిని అందిస్తోంది. నదుల అనుసంధానం తరహాలోనే ప్రభుత్వం వాగులు- చెరువుల అనుసంధానానికి పూనుకుంటే సాగునీటి సమస్యను అధిగమించడానికి వీలుంది.  వాగులపై ఆధారపడి 50 వేల హెక్టార్లలో రైతులు మెట్ట, మాగాణి పంటలు సాగు చేస్తున్నారు. వీటి పరివాహక ప్రాంతాల్లో మెట్ట పంటల కంటే మాగాణి పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటోంది. ఆయకట్టులోని సాగుదారులు వ్యవసాయ విద్యుత్తు మోటార్లు, ఆయిల్‌ ఇంజిన్లతో వాగుల్లోని నీటిని తోడుతూ సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. 

Related Posts