విజయనగరం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ టికెట్ విషయం ఇపుడు రసకందాయంలో పడింది. వైసీపీలో ప్రముఖుడుగా ఉన్న బొత్స అసెంబ్లీ సీటుకు పోటీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచే మళ్ళీ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. విభజన సమయంలో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న బొత్స ఇక్కడ నుంచి పోటీ చేసి బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఏపీలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్లు పోతే బొత్సకు మాత్రం గౌరవప్రదమైన స్థానమే దక్కింది. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయన నాటి నుంచి ఇప్పటివరకు చీపురుపల్లిని విడవకుండా జనంలోనే ఉంటూ వచ్చారు. ఎక్కడికక్కడ పార్టీని పటిష్టం చేసుకుని పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఆయన సీట్లో మరో వైసీపీ నేత కూడా కన్నేసి పోటీకి తయారు అనడం ఇపుడు చర్చనీయాంశంగా ఉంది.చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు పార్టీ విజయనగరం పార్లమెంట్ ఇంచార్జి బెల్లాల చంద్రశేఖర్ కూడా చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. పలుకుబడి తో పాటు కాపు సామాజికవర్గానికే చెందిన ఆయనకు కూడా చీపురుపల్లిలో పట్టుంది. ఇక జిల్లా వైసీపీ రాజకీయాల్లో వర్గ పోరు నడుస్తోంది. ఈ కారణంతో బొత్సకు వ్యతిరేక వర్గంగా ఉన్న బెల్లాల ఏకంగా అక్కడ నుంచి టికెట్ కోరడం విశేషం. ఆయనకు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి, జగన్ ఫస్ట్ టికెట్ డిక్లేర్ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి మద్దతు కూడా ఉందని అంటున్నారు.ఇవన్నీ ఇలా ఉంటే అధినేత జగన్ ఈ పోటీలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలని అంటున్నారు. జగన్ విషయానికి వస్తే బొత్స అసెంబ్లీకి పోటీ చేయడం ఇష్టం లేదని అంటున్నారు. ఆయన్ని విజయనగరం పార్లమెంట్ కి పోటీ చేయించలనుకుంటున్నారు. అదే జరిగితే ఆయన ఆశిస్తున్న చీపురుపల్లి సీటు కచ్చితంగా బెల్లాల చంద్రశేఖర్ పరమవుతుంది. ఈ అంచనాలతోనే బెల్లాల అక్కడ సీటుపై ఆశలు పెంచుకున్నారని అంటున్నారు. మరి బొత్స ఎంపీకి పోటీకి విముఖంగా ఉన్నారు. జగన్ ను బలవంతం చేసైనా తన సతీమణిని నిలబెట్టి తాను మాత్రం అసెంబ్లీ బరిలోనే నిలవాలనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.