కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మంత్రులను ఎనిమిది మందిని చేర్చుకోవడమే కాకుండా శాఖలను కూడా మార్చారు. ఇది కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ కూర్పులోనూ, శాఖల మార్పుల్లోనూ సిద్ధరామయ్య పైచేయి సాధించారని ఒక వర్గం అంటుంటే…. కుమారస్వామిని పరోక్షంగా దెబ్బతీయడానికే సిద్ధూ ఈ ఎత్తు వేశారన్నది మరి కొందరి వాదన.కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్నికల ముందు వరకూ పీసీపీ చీఫ్ గా పనిచేసిన పరమేశ్వరకు హోంమంత్రి పదవి ఇచ్చారు. అయితే సంకీర్ణ సర్కార్ ఏర్పాటయిన దగ్గరనుంచి ముఖ్మమంత్రి కుమారస్వామితో పరమేశ్వర, మరోమంత్రి డీకే శివకుమార్ సఖ్యతగా ఉన్నారు. సమన్వయ సమితి కమిటీ ఛైర్మన్ గా ఉన్న సిద్ధరామయ్య చేస్తున్న సూచనలు కూడా పట్టించుకోలేదు. ప్రధానంగా అధికారుల బదిలీల్లో కుమారస్వామి తీసుకున్న నిర్ణయాన్ని సిద్ధరామయ్య తప్పుపట్టినా పరమేశ్వర, డీకే శివకుమార్ లు ఆయన పక్షానే నిలిచారు.ఇందుకు ప్రతిగానే సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ శాఖల మార్పు ప్రస్తావన తెచ్చారంటున్నారు. పరమేశ్వరకు ఉన్న హోంమంత్రిత్వ శాఖను తప్పించడంలో సిద్ధూ సక్సెస్ అయ్యారంటున్నారు. పరమేశ్వర లోలోపల అసంతప్తిగా ఉన్నప్పటికీ బయటపడకుండా లోలోపల మదన పడుతున్నారు. కుమారస్వామికి చెక్ పెట్టేందుకే పరమేశ్వరను హోంమంత్రిగా తొలగించారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. అయితే ఇది కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.పరమేశ్వరకు జనతాదళ్ ఎస్ అండగా నిలుస్తోంది. కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ పరమేశ్వరను హోంమంత్రిగా తప్పించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితులను అణగదొక్కేందుకే పరమేశ్వరను ఆ పదవి నుంచి తప్పించారంటూ పరోక్ష విమర్శలను కాంగ్రెస్ పై చేశారు రేవణ్ణ. అంతేకాదు సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా పరమేశ్వరను హోంమంత్రి పదవి నుంచి తప్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం నలుగురు ఆధిపత్యమే కర్ణాటక కాంగ్రెస్ లో కొనసాగుతుందని, దళితులను అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయం మల్లికార్జున ఖర్గే నిర్వహించిన సమావేశంలో వ్యక్తమయినట్లు సమాచారం. మొత్తం మీద సిద్ధూ అనుకున్నది సాధిస్తూ… క్రమంగా పట్టుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.