2018లో అద్భుతంగా పనిచేశాం. అన్ని శాఖల్లో మంచి పురోగతి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అభినందించారు. సోమవారం నీరు-ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిఒక్కరికి సదుపాయాలు కల్పించాం. ప్రజల ఇబ్బందులను తొలగించాం. 2018లో చేసిన కృషి ఫలితాలు 2019లో వస్తాయి. తొలి 6నెలల్లోనే 11.5% వృద్ది సాధించాం. ఈ ఏడాది వివిధ రంగాలలో 675పైగా అవార్డులు సాధించామని అన్నారు. కృషి కళ్యాణ యోజనలో మన మూడు జిల్లాలు దేశంలోనే నెంబర్ వన్. విజయనగరం,విశాఖ,కడప ఈ ఘనత సాధించాయి. ముందు చూపు, నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, డిజిటలైజేషన్, ఉబరైజేషన్, కన్వర్జెన్స్, టెక్నాలజి, ట్రాన్స్ ఫర్మేషన్(వయాడక్ట్) తోనే ఇన్ని అవార్డులు సాధించాం. నేను బృంద నాయకుడిని మాత్రమే. మొత్తం ఘనత బృందానికే చెందుతుంది.సహకరించిన అందరికీ ధన్యవాదాలు. 2019లో అందరికీ శుభం జరగాలి. తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూడాలి. విశాఖలో మెడ్ టెక్ జోన్ దేశానికే తలమానికమని వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాలలో యువత ఉపాధి కోసమే ఎంఎస్ఎంఈ పార్కులు చేసామని అన్నారు. ఐదువేల మంది కౌలు రైతులకు పంటరుణాలు దేశంలోనే చరిత్ర. రాష్ట్రంలో కౌలు రైతులు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేశాం. పంట బీమా రాష్ట్ర ప్రభుత్వ వాటా వెంటనే విడుదల చేయాలి. కేంద్రం వాటా విడుదల చేసేలా ఒత్తిడి తేవాలి. రబీలో వ్యవసాయంలో వృద్ది మరింత పెరగాలని సూచించారు.