జనవరి 15 నుంచి ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో కుంభమేళా నిర్వహించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ.. యూపీ మంత్రులు వివిధ రాష్ట్రాల సీఎంలు, ముఖ్యులకు స్వయంగా ఆహ్వాన పత్రాలను అందజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కూడా యూపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. విజయవాడ వచ్చిన ఉత్తర ప్రదేశ్ మంత్రి సతీష్ మహానా.. బాబు నివాసానికి విచ్చేసి ఆహ్వానం అందించారు. కుంభమేళాతోపాటు వారణాసిలో జనవరి 31 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొనాలని కూడా బాబును కోరారు. కోట్లాది మంది హిందువులు పాల్గొనే కుంభమేళా కోసం అలహాబాద్ పరిసర ప్రాంతాలు ముస్తాబు అవుతున్నాయి. వీఐపీలు, విదేశాల నుంచి వచ్చే ఎన్నారైల సౌకర్యం కోసం ఫైవ్ స్టార్ హోటళ్లను తలదన్నేలా టెంట్ హౌస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కుంభమేళాలో పాల్గొనేవారికి ఐడీ కార్డు తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.