రాజ్యసభలో తలాక్ బిల్లును అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు.. పిలుపునిచ్చారు. ముమ్మారు తలాక్ చెప్పడం నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును కేంద్రం రాజ్యసభకు తీసుకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఇరువురు నేతలకూ ఫోన్ చేసిన చంద్రబాబు.. ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలని, వారి హక్కులను కాపాడాలని కోరారు. బిల్లును అడ్డుకునేందుకు భాజపాయేతర పక్షాల సభ్యులందరినీ ఏకం చేయాలని విజ్ఞప్తి చేశారు. భాజపా ముస్లిం వ్యతిరేక చర్యలను గట్టిగా ప్రతిఘటించాలని ఇరువురు నేతలనూ కోరారు. అంతకుముందు ఈ అంశంపై పార్టీ ఎంపీలతో మాట్లాడిన సీఎం.. తమ సభ్యులంతా హాజరయ్యేలా విప్ జారీ చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు రాజ్యసభలో ఈ బిల్లును పాస్ కానివ్వబోమని తెదేపా ఎంపీలు దిల్లీలో స్పష్టం చేశారు.తలాక్ బిల్లు రాజ్యసభకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. మరోవైపు భాజపా నేతలు సమావేశమయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. మరోవైపు విపక్ష పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఛాంబర్‌లో సమావేశమయ్యారు.