ఏపీ హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో హైకోర్టులో లాయర్లు, సిబ్బంది హడావుడి నెలకొంది. సిబ్బంది, ఫైళ్లను తరలించేందుకు 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఏపీ లాయర్లకు, తెలంగాణ లాయర్లు వీడ్కోలు పలికారు. మంగళవారం ఉదయం 8.30కి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే, ఉదయం 11.30కి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ప్రవీణ్కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు కార్యకలాపాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జిలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 1వ తేదీన హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర జడ్జిల ప్రమాణ స్వీకారానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు హైకోర్టు కార్యాలయం కోసం ఎంజీ రోడ్డులోని ఏపీఏటీ భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిలో ఫర్నీచర్ సమకూర్చాలని సీఆర్డీఏను ఆదేశించారు. హైకోర్టు కార్యకలాపాలకు అవసరమైన కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు. హైకోర్టు జడ్జిలు, రిజిస్ర్టార్లకు నోవోటెల్ హోటల్లో వసతి ఏర్పాటు చేయాలని ప్రొటోకాల్ డైరెక్టర్ను ఆదేశించారు. ఇతర న్యాయ శాఖ అధికారులకు స్టేట్ గెస్ట్హౌస్ లో వసతి ఏర్పాటు చేస్తున్నారు.