2018 సంవత్సరాన్ని దేశీయ స్టాక్మార్కెట్లు మిశ్రమంగా ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ఫ్లాట్గా ముగియగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ మాత్రం స్వల్ప లాభంతో 10,900 దిగువన ముగిసింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం సెన్సెక్స్160 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించగా.. నిఫ్టీ 10,900 వద్ద ప్రారంభమైంది. ఆరంభంలో ఆటోమొబైల్స్, మెటల్, ఫార్మా తదితర రంగాల్లో కొనుగోళ్లు వెళ్లువెత్తడంతో సూచీలు లాభాల్లో పయనించాయి. ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన మార్కెట్ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8.39 పాయింట్ల నష్టంతో 36,068.33 వద్ద ముగియగా, నిఫ్టీ 2.65 పాయింట్ల స్వల్ప లాభంతో 10,862.55 వద్ద ఫ్లాట్గా ముగిసింది. ట్రేడింగ్లో 1495 షేర్లు లాభపడగా.. 1095 షేర్లు నష్టపోయాయి. 164 షేర్ల విలువలో ఎలాంటి మార్పులేదు. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 13 పైసలు బలపడి 69.80 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో జేఎస్డబ్ల్యూ స్టీల్ (+2.90), టాటా స్టీల్ (+1.60), వేదాంత (+1.40), టెక్ మహింద్రా (+1.28), సన్ ఫార్మా (+1.25) సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించాయి. మరోవైపు భారతీ ఇన్ఫ్రాటెల్ (-1.52), భారతీ ఎయిర్టెల్ (-1.28), హెచ్పీసీఎల్ (-1.04), ఐవోసీ (-0.83), యాక్సిస్ బ్యాంక్ (-0.82) సంస్థల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.