విశాఖ మన్యంలో చలి పంజా విసిరింది. గత పదేళ్లలో ఎన్నడూ నమోదుకాని ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీనికితోడు పొగమంచు కమ్ముకోవటంతో వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందికరంగా మారింది. చింతపల్లి, లంబసంగిలో 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్నిప్రాంతాల్లో మంచు జల్లులు సైతం కురుస్తున్నాయి.అటు తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో విపరీతమైన చలితోపాటు మంచుదుప్పటి మన్యాన్ని కప్పివేసింది. తెల్లవారుజామునుండి ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడకపోడంతో వాహనచోదకులు దారి కనిపించక ఇబ్బందులు పడ్డారు. ఒంటి నిండా దుస్తులు ధరించి, స్వెటర్లు వేసుకుని తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం కొనసాగించారు. మైదాన ప్రాంతాల నుండి వచ్చే వారు మంచుతెరలను చీల్చుతూ భూమిపై పడుతున్న సూర్యకిరణాలను చూస్తూ ఆస్వాదించసాగారు. మంచుతోపాటు చలి కూడా విపరీతంగా పెరిగిపోడంతో మారుమూల గిరిజన పల్లెల్లో చలి మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మండలంలో లోతట్టున దట్టమైన అటవీ ప్రాంతం మధ్య ఉన్న వాతంగి, లోదొడ్డి, పూదూడు, పాకవెల్తి, గొబ్బిలమడుగు, చీడిపాలెం తదితర గ్రామాల్లో గిరిజనులు గణనీయంగా పడిపోయిన ఉష్టోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం అని చెప్పవచ్చు.