ఆంధ్రప్రదేశ్ ఒక అరుదైన రికార్డు సాధించింది. కర్నూలు ఎయిర్‌పోర్టును కేవలం ఏడాదిన్నరలో పూర్తి చేసేసింది.
2017 జూన్లో చంద్రబాబు కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా 18 నెలలకు ఎయిర్ పోర్టు సిద్ధమయ్యింది. ఇది దేశ చరిత్రలో రికార్డు సమయంలో నిర్మించిన ఎయిర్‌పోర్టు. ఇది కర్నూలు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా… నంద్యాల పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోఉంది.
రిమోట్ ప్రాంతాలకు కూడా సత్వర వేగంతో కూడా ప్రయాణ సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో దేశంలో 50 కొత్త చిన్న ఎయిర్ పోర్టులను నిర్మించాలని అప్పటి యూపీఎ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా… చాలా వేగంగా స్పందించి ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాయి. చంద్రబాబు ఈసారి హయాంలో కడప ఎయిర్‌పోర్టును పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం ఒక రికార్డు అయితే, కర్నూలు ఎయిర్‌పోర్టును కేవలం 18 నెలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం ఎన్నడూ ఎరుగని ఘనత. ఈరోజు కర్నూలు ఎయిర్‌పోర్టులో ట్రయల్‌రన్ నిర్వహించారు. జనవరి 7న ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. ఈ ఎయిర్‌పోర్టును నిర్మించిన సంస్థ భోగాపురం ఎయిర్‌పోర్టు కంపెనీ కావడం విశేషం. ఇది కేంద్ర ఏవియేషన్ అనుమతి ఉన్న కంపెనీ. పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపడుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేవలం విమానాశ్రయమే కాకుండా, పరిశోధన నుంచి విమాన తయారీ, ప్రయాణాల వరకు అన్ని విమాన సంబంధిత పరిశ్రమలు, వ్యవహారాలు ఇందులో జరుగుతాయి. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుల్లో ఇదొకటి. ఇపుడు ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నేవీ పరిధిలో ఉండటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. నేవీ నిబంధనలకు లోబడి పనిచేస్తోంది. అందుకే ఈ ఇంటర్నేషనల్ సిటీ మరింత అభివృద్ధి కావాలంటే… భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశోధన సంస్థ, తయారీ పరిశ్రమ వంటి అనుసంధాన పరిశ్రమలతో ఐదు వేల పైచిలుకు ఎకరాల్లో ఏర్పాటువుతోంది.ఇది పక్కన పెడితే… దేశంలో మెట్రో పాలిటిన్ సిటీలు లేని నాలుగు పక్కపక్క జిల్లాలో అన్నింటిలో ఎయిర్‌పోర్టులు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఒక రీజియన్ పరంగా పోలిస్తే ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్టు ఉన్న ఏకైక ప్రాంతం రాయలసీమ. రాయలసీమంలో వంద కిలోమీటర్లు లోపు ఎటు వెళ్లినా ఎయిర్ పోర్టు అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత.ఇక చంద్రబాబు వచ్చాక విశాఖపట్నం, గన్నవరం, తిరుపతి అంతర్జాతీయ విమనాశ్రయాలుగా అవతరించాయి. ఇలా మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దేశంలో అత్యధిక ఎయిర్‌పోర్టులు ఉన్న రాష్ట్రంగా కూడా ఏపీకి ఓ రికార్డు ఉంది. అంతేగాకుండా ఏపీలో 13 జిల్లాలు ఉంటే… కేవలం శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు జిల్లాలో మాత్రమే ఎయిర్‌పోర్టు లేదు. అయితే అమరావతి పూర్తయితే గుంటూరులో ఎయిర్‌పోర్టు వస్తుంది. అపుడు ఇక ప్రకాశం, శ్రీకాకుళం ఒక్కటే మిగిలిపోతాయి. నెల్లూరు, విజయనగరం (భోగాపురం) ఎయిర్‌పోర్టులు నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే.దేశంలో 50 ప్రాంతాలకు యూపీఏ ప్రభుత్వం ఎయిర్‌పోర్టులు మంజూరు చేస్తే కేవలం ఏపీ మాత్రమే వాటిని అంత ఎందుకు సద్వినియోగం చేసుకుందో తెలుసా? చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయమే దానికి కారణం. ఎయిర్‌పోర్టులు సత్వరం పూర్తి కావాలంటే… పనులు పక్కాగా జరిగేలా చూస్తూ పర్యవేక్షించగలిగిన సమర్థులైన బృందం కావాలి. అది లేకపోతే అవి మరుగున పడతాయి. ఆలస్యమవుతాయి. అందుకే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఓ కంపెనీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్). ఇందులో ఏడుగురు ఐఏఎస్ అధికారులు డైరెక్టర్లుగా ఉన్నారు. వారిని విమానాశ్రయాల నిర్మాణాలకు బాధ్యులను చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలో విమానాశ్రయాల నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నిజానికి ఇలాంటి పనులు ఓట్లు రాల్చవు. వృద్ధి రేట్లు జనాలకు ఎక్కవు. ఫ్రీ పథకాలకు దక్కినంత ప్రచారం వీటికి దక్కదు. అయినా చంద్రబాబు మారడు. ఇలాంటి ఫ్యూచర్ ప్లానింగ్‌లో ఆయనుంటే… ఇతర పక్షాలు చంద్రబాబును దాటి సుదూరంగా ముందుకెళ్లిపోతున్నాయి. సరే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇలాంటి ప్లానింగ్ వల్ల బాగుపడేది మాత్రం ఏపీ ప్రజలే.