ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో అనుభవం ఉన్న నేతకే ఆంధ్రా ఓటర్లు జై కొట్టారు. ఈ సారి మాత్రం జనసేన ఎంట్రీ ఇవ్వడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ఈ పార్టీలకు తోడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా పోటీకి సిద్ధమవుతుండడంతో 2019 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. అన్ని పార్టీల అధినేతలు ఇప్పటి నుంచే యాత్రలు చేస్తుండడంతో, అవి కాస్తా ఎన్నికల ప్రచార సభలుగా కనిపిస్తున్నాయి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాటం, జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర, పవన్ కల్యాణ్ ప్రజాపోరాట యాత్ర చేస్తున్నారు. ఈ సభల్లో ప్రత్యర్థులపై తమదైన శైలి ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు విజయం సాధిస్తారో చెప్పడం కష్టంగా మారింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్.. ‘జై చంద్రబాబు’ అని పలుమార్లు నినదించారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతిపక్ష నేత అయిన జగన్.. ‘జై చంద్రబాబు’ అని ఎందుకు అన్నారో మీరే చూడండి.చంద్రబాబు అంటేనే అంతెత్తున లేచే జగన్.. శ్రీకాకుళంలో జరిగిన సభలోనూ భిన్నమైన ప్రసంగంతో జనాల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు లక్షల ఇళ్లు ఇస్తుందట. నాలుగున్నరేళ్లు ఇళ్లు ఇవ్వలేదు. ఎన్నికలు ఇక మూడు నెలలున్నాయనగానే ప్రముఖ పేపర్‌లో ఓ కథ రాశారు. ఐదు లక్షల ఇళ్లట. వాటిని కూడా కట్టించి ఇవ్వరట. కేవలం మంజూరు చేస్తాడట. వాటిని కూడా జన్మభూమి కమిటీలు మంజూరు చేస్తాయట. మంజూరు చేశాక.. పునాదులకు మాత్రమే శాంక్షన్ అట, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కడతారట. మంజూరైన వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వకుండానే శాంక్షన్ లెటర్లకే టీడీపీ వాళ్లు వచ్చి ఆ ఇళ్ల మీద స్టిక్కర్లు అంటిస్తారట. ఆ స్టిక్కర్లను మనం అంటించుకుని ఇక.. జై చంద్రబాబు.. జై చంద్రబాబు, జై చంద్రబాబు అంటూ ఉండాలట. రుణమాఫీ చేయకుండానే చేసేశాడని రైతులందరూ జై చంద్రబాబు, జై చంద్రబాబు అని కేరింతలు కొట్టాలట. ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు పూర్తిగా ఎగ్గొట్టారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు చెవుల్లో పెద్ద పువ్వు పెట్టాడంటూ కామెంట్స్ చేసేశారు. చంద్రబాబు తమకు రుణమాఫీ చేయకపోయినా చేసినట్లుగా టీడీపీ స్టిక్కర్లు అతికించాలట. జై చంద్రబాబు, జై చంద్రబాబు అనాలట’’ అంటూ ప్రసంగించడంతో అక్కడున్న వారంతా కేరింతలు కొట్టారు. జగన్ చెప్పినట్లు జనాలు ‘జై చంద్రబాబు’ అనాలో లేదో కానీ, ఆయన అన్ని సార్లు అనడంతో టీడీపీ అభిమానులు నవ్వుకుంటున్నారు