ఉమ్మడి రాష్ట్రాల హైకోర్ట్ ఎట్టకేలకు విభజన జరిగింది. ఐతే ఇప్పుడు చర్చంతా.. హైకోర్టు విభజనతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టమన్నది జోరుగా సాగుతోంది. విభజనతో తమకే లాభమని.. ఇందులో మరో వాదనకు అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ అండ్ కో చెబుతున్నా.. కొన్ని వర్గాలు మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. వేర్వేరు హైకోర్టు కారణంగా తెలంగాణకు ఒరిగే ప్రయోజనం ఉండదన్న విమర్శ చేస్తున్నా.. అలాంటిదేమీ లేదు.. మాకుండే లెక్కలు మాకున్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. హైకోర్టు విభజన కారణంగా మొదట్లో తమకు కష్టాలు ఎక్కువే అయిన... దూరదృష్టితో చూస్తే.. తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ ప్రయోజనమన్న మాట వినిపిస్తోంది. హైకోర్టు విభజన కారణంగా కేసీఆర్ సర్కారుకు కలిగే లాభాన్ని పక్కన పెడితే.. హైదరాబాద్కు అంతో ఇంతో నష్టం వాటిల్లుతుందని చెబుతారు. అదెలానంటే.. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం 3.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి.వాటిల్లో 70 శాతం వరకూ ఏపీకి చెందిన కేసులే. అంటే.. లక్షలాది కేసుల విషయమై నిత్యం హైదరాబాద్ రావాల్సి ఉండేది. పాత కేసులు మాత్రమే కాదు.. కొత్త కేసుల విషయమై లాయర్లు.. మిగిలిన వారితో మాట్లాడటానికి హైదరాబాద్ రావాల్సిన అవసరం ఇకపై ఏపీ ప్రజలకు ఉండదు.అందరి దారి విజయవాడ అవుతుంది. లక్షలాది కేసులు ఏపీకి తరలివెళ్లిన నేపథ్యంలో.. వీటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవటానికి అవసరమైన ఉపాధి అవకాశాలు ఏపీకి లభిస్తాయి. అదే సమయంలో.. ఇప్పుడున్నంత రద్దీ హైదరాబాద్ హైకోర్టులో ఉండదు. దీంతో.. హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టులో ఇప్పుడున్నంత జోరు రానున్న రోజుల్లో కనిపించదు. అంతేకాదు.. రెండు రాష్ట్రాలకు కేటాయించిన జడ్జిల సంఖ్యను చూస్తే.. ఏపీకి34 మంది కాగా.. తెలంగాణకు 24 మంది జడ్జిలు కేటాయించారు. ఇక.. ప్రస్తుతం జరిగిన విభజన నేపథ్యంలో ఏపీకి 37 మంది జడ్జిలను కేటాయించగా..ప్రస్తుతం ఉన్న వారు 14 మంది మాత్రమే. ఇలా ప్రతి విషయంలోనూ హైదరాబాద్ కు కేసులు.. న్యాయమూర్తులు.. న్యాయవాదులు.. కేసులు తగ్గిపోవటం హైదరాబాద్ మీద అంతో ఇంతో ప్రభావం చూపించటం ఖాయమన్న మాటను న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.కొన్ని విషయాల్లో లాభనష్టాల్ని అస్సలు చూడకూడదు. కానీ.. పాడు సమాజం అలా ఉండనీయదు. ప్రతి విషయంలోనూ అన్ని కోణాల్ని చూడాల్సిందేనని ఒత్తిడి చేస్తుంది. రాష్ట్రం విడిపోయిన నాలుగున్నరేళ్లు దాటుతున్నా.. ఇంకా ఉమ్మడి హైకోర్టు ఏంది? ఛత్.. మా హైకోర్టు మాకివ్వాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్కు తగ్గట్లే తాజాగా ఎవరికి వారికి హైకోర్టులు ఏర్పడ్డాయి.