భక్తులకు అభయమిచ్చే దేవదేవుళ్లకు రక్షణ లేకుండాపోతోంది. గుప్త నిధులు ఉంటాయనే ఆశతో దుండగులు దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. హిందూపురం, పెనుకొండ మడకశిర నియోజకవర్గాల పరిధిలో పురాతన ఆలయాలు, కట్టడాలను లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. ఫలితంగా చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న నిర్మాణాలు రూపురేఖలు కోల్పోతున్నాయి. రాజకీయుల అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీసులు, పురావస్తు అధికారులు కన్నెత్తయినా చూడని దారుణమిది.
అమరాపురం మండలంలోని హేమావతిలో నోళంబ పల్లవులు క్రీ.శ.730లో సిద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ దక్షిణ భారత దేశంలోనే శివుడు ఎక్కడా లేని విధంగా మానవ రూపంలో వెలిసి ఉన్నాడు. ఈ ప్రాంతంలో గతంలో ఎక్కడ తవ్వినా శివలింగాలు, నంది విగ్రహాలు దొరికేవి. అప్పటి శిల్పులు నంది విగ్రహాల చెవుళ్లో వజ్రాలు అమర్చి ఉంటారని భావించిన దుండగులు వాటిని ధ్వంసం చేశారు. గతంలో ఈ ఆలయంలో ప్రవేశించిన దొంగలు దాదాపు 50 కేజీల వెండి, బంగారం ఎత్తుకెళ్లారు. పోలీసులు దొంగలను పట్టుకుని ఆభరణాలను ఆలయానికి అప్పగించారు. గత నెల హేమావతి పరిసరాల్లో గునపాలు, గడ్డపారలు, గుప్త నిధుల తవ్వకాలకు అవసరమైన పరికరాలతో నలుగురు వ్యక్తులు సంచరిస్తుండగా గ్రామస్థులు అనుమానించి పోలీసులకు పట్టించారు. పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. ఆ అనుమానితులను మడకశిర మండలంలోని ఓ పార్టీ చెందిన నాయకుడు విడిపించినట్లు సమాచారం.
పాళేగాళ్ల కాలంలో రత్నగిరి కోటపై అశ్వశాలలు, నాట్య మందిరాలు, స్నానపు కొలనులు నిర్మించారు. ఇక్కడ ఉన్న ఏనుగులు, గుర్రాల రాతి శిల్పాలు గుప్త నిధుల ముఠా చేతుల్లో ధ్వంసం అయ్యాయి. కోటపై పురాతన కట్టడాలు, బురుజులు, మండపాలు, శిల్పాలు ఉన్నాయి. చారిత్రాత్మక కట్టడాలు కావడంతో వాటి కింద నిధి ఉంటుందని అనేక సార్లు తవ్వకాలు చేపట్టారు. చూడటానికి ఎంతో అందంగా కనిపించే కోటలో అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోతోంది. రాత్రి వేళ కొండపై బంగారం, వజ్రాల కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. పశువుల కాపర్లు, పర్యాటకులు వెళ్లిన సమయంలో ఎక్కడ పడితే అక్కడ గుంతలు కనిపించడమే ఇందుకు నిదర్శనం.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెరువులను తవ్వించారని ఏళ్ల క్రితం నిర్మించిన తూముల్లో సైతం నిధులు ఉంటాయని దుండగులు జేసీబీలతో గుంతలు తవ్వుతున్నారు. ఇటీవల మడకశిర మండలం మరువపల్లి గ్రామంలో చెరువులోని తూము సమీపంలో తొలుత జంతు బలి ఇచ్చి క్షుద్ర పూజలు జరిపారు. ఆతర్వాత జేసీబీతో పెద్ద గుంతను తవ్వారు. ఇందులో నిధి లభించిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
మడకశిర కొండపై మరాఠ మహారాజులు కోటలు, బురుజులు నిర్మించారు. వారి కుల దైవమైన రామలింగేశ్వర ఆలయాన్ని మురహరిరావు అనే మరాఠ మహారాజు నిర్మించారు. ఆలయంలోని నంది, వినాయక విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసి కొలనులో పడేశారు. రామలింగేశ్వరస్వామి లింగాన్ని సైతం పెకళించి పక్కనే పెట్టారు. ధ్వజ స్తంభాన్ని పగలగొట్టారు. అక్కడ భారీ గుంతలు తవ్వారు. 20 రోజుల కిందట ఆలయ సమీపంలో, కొలను కింద లోతుగా తవ్వి చేతికి వేసుకునే తొడుగులు అక్కడే వదిలేసి వెళ్లారు. పట్టణ పరిధిలోని పెనుకొండ రోడ్డులో ఉన్న పురాతన ఆంజనేయస్వామి ఆలయంలోని గర్భగుడిలో విగ్రహం ముందు పెద్ద గుంత తవ్వారు. ఇందులో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.