ఏపీ రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వెలుగు చూస్తాయో? ఎప్పుడు ఎవరు ఎలా దూసుకు వస్తారో కూడా చెప్పడం కష్టంగా ఉంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు ఏపీ ఊసు కూడా ఎత్తని తెలంగాణా ఉద్యమ సారధి, సీఎం కేసీఆర్‌పై ఇప్పుడు ఏపీలోనూ అతి పెద్ద చర్చ నడుస్తోంది. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్, ఆయన పార్టీ తరఫున అక్కడ ఆ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్ని అంటాయి ఇది కేసీఆర్‌లో కొంతమేరకు ఆనందం నింపింది. అయితే, అదేసమయంలో ఏపీలోనూ కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లకు కొన్ని వర్గాలు, కొన్ని జిల్లాల్లో ఆనందం వ్యక్తమైంది. పాలాభిషేకాలు కూడా చేశారు.యధాలాపంగా టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ఖాతాలోకే వేసేశారు., జగన్ కావాలనే తనపై కక్ష కట్టి ఇలా చేయించారని, ఏపీని విభజించిన, పోలవరానికి, ప్రత్యేక హోదాకు కూడా అడ్డుపడిన కేసీఆర్‌తో జట్టుకట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని బాబు విమర్శించారు. దీనినే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మార్చాలని కూడా తమ్ముళ్లకు హితబోధ చేశారు. కట్ చేస్తే.. ఇక్కడే ఓ కీలక అంశం చర్చకు వస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణాలో చంద్రబాబు పార్టీ అక్కడ పోటీ చేసింది కాంగ్రెస్‌తో జట్టు కట్టుకుని మరీ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. చంద్రబాబు, బాలయ్యలు స్వయంగా ప్రచారం కూడా చేశారు. అసలు తెలంగాణా ప్రజలు తమను ఇష్ట పడుతున్నారో లేదో ? తమ పాచికలు పారతాయో లేదో కూడా తెలుసుకోకుండానే వీరు అక్కడ పర్యటించారు. ఎన్నికల ఫలితాలను బట్టి చంద్రబాబును అక్కడి ప్రజలు తిరస్కరించారనే విషయం స్పష్టమైంది. ఇక, ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే.. ఇక్కడ ఆయన పార్టీ పెట్టింది లేదు. ఆయన పార్టీని ఇక్కడ విస్తరిస్తారన్నది కూడా నమ్మకం లేదు. కానీ, ఏపీలోని 6 జిల్లాల్లో (గుంటూరు, కృష్ణా, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి) మాత్రం కేసీఆర్‌కు ప్రజలు జై కొట్టారు. ఆయన తెలంగాణాలో విజయం సాధిస్తే.. ఈ జిల్లాల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇక, కొన్ని చోట్ల పాలాభిషేకాలు కూడా జరిగాయి.విశాఖలో అయితే.. కేసీఆర్‌కు జై కొట్టేందుకు వేలాది మంది ప్రజలు విమానాశ్రయం సహా విశాఖ శారదా పీఠానికి ప్రజలు పోటెత్తారు. మరి తెలంగాణాలో చంద్రబాబుకు పాలాభిషేకం చేసింది లేదు. ఆయన పార్టీ అక్కడ ఉన్నా ఎలాంటి హడావుడీ ప్రజల్లో కనిపించలేదు. కానీ, దీనికి విరుద్ధంగా ఇక్కడ కేసీఆర్‌కు ప్రజలు జై కొడుతున్నారు. ఇప్పుడు దీనిపైనే మేధావులు సైతం చర్చ చేస్తున్నారు. కేసీఆర్ ఏనాడూ.. ఏపీ ప్రజల గురించి మాట్లాడలేదు. అయినా ఆయనకు ఇక్కడ అభిమానులు పెరుగుతుండడం ఏంటనే విషయం అంతు పట్టడం లేదు. మరి రాబోయే రోజుల్లో కేసీఆరే ఇక్కడ శక్తిగా అవతరిస్తారా ? పరోక్షంగా జగన్ లేదా పవన్‌లలో ఎవరికి అయినా సపోర్ట్ చేస్తారా ? అన్నది చూడాలి.