ఏపీలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాలు జరిగే ఈ 10 రోజులు వారి వారి గ్రామాలు, వార్డుల్లోనే ఉండాలని సూచించారు. ఇది ఎన్నికల ఏడాది, చాలా కీలకమైన సమయమన్నారు. భావితరాల భవిష్యత్తు ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉందన్నారు. తెలుగు దేశం పార్టీ గెలవాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీపై, రాష్ట్రంపై దుష్టశక్తులు కక్షకట్టాయని అయన అన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన కరెంటు డబ్బులు చెల్లించరు గానీ పొరుగు రాష్ట్రం యాడ్స్ ఏపీలో ఇస్తున్నారన్నారు. తానేదో ఆక్రోశంలో ఉన్నానని ప్రధాని మోడీ అంటున్నారని అన్నారు. ఏపీ ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే ప్రధాని తన ఏపీ పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. ఇద్దరం సీఎంలుగా పని చేశామని, మోడీ అహ్మదాబాద్ కు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ను తాను అభివృద్ధి చేశానని, అహ్మదాబాద్ కు హైదరాబాద్ కు పొంతనే లేదని పేర్కొన్నారు.. హుందాతనం లేకుండా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కరువు, తుఫాన్లకు మోడీ డబ్బులు ఇవ్వరన్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ గెలిస్తే తన అసమర్థత బయటపడుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. ఏపీ, తెలంగాణలు సఖ్యతతో ఉండాలని, కానీ, కేసీఆర్ అందుకు సుముఖంగా లేరని అన్నారు. కేసుల మాఫీ కోసం జగన్ కు అధికారం కావాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారితో జగన్ జత కట్టారన్నారు. మోడీ, జగన్, కేసీఆర్ ముగ్గురు ఏపీపై పగబట్టారని విమర్శించారు. నాలుగు రోజులు కూడా గడువు ఇవ్వకుండా హైకోర్టు తరలించారన్నారు. త్రిపుల్ తలాక్ లో ఒకలా, శబరిమలలో మరో రకంగా బీజేపీ కుట్రలు విభజించి పాలించాలని, ముస్లిం కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.