YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు

అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు
కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామిని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్నారు. కేరళలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్లు లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి.  బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లు కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు వెల్లడించారు. ‘‘మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మేం పంబ చేరుకున్నాం. అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిదానానికి వచ్చాం. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు. కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేదు’’ అని మహిళలు చెబుతున్నారు. కాగా.. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. వీరు నిజంగా దర్శనం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. స్వామి దర్శనం అనంతరం వీరిని అంతే వేగంగా కొండ కిందకు దింపి, ప్రత్యేక వాహనంలో నీలక్కల్ దాటించినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనపై అయ్యప్ప దర్శ సేన నాయకుడు రాహుల్ ఈశ్వర్ స్పందించారు. మహిళలు దర్శనం చేసుకున్నారంటే నమ్మకం కలగడం లేదని, ఒకవేళ వాళ్లు రహస్యంగా వెళ్లినట్లు తెలిస్తే మాత్రం మేం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. తీర్పు నేపథ్యంలో గతంలో కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత కల్పించినప్పటికీ భక్తులు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. ఈ క్రమంలో డిసెంబరు 18న బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో పంబ నుంచి సన్నిధానానికి కిలోమీటరు దూరంలో ఉన్న మారకూటం వరకు చేరుకున్నారు. అయితే అక్కడ భక్తులు వీరిని అడ్డుకోవడంతో ఆ సమయంలో పోలీసులు వారిని వెనక్కి పంపించారు. తాజాగా నేడు తెల్లవారుజామున వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న వీడియో బయటకు వచ్చింది.

Related Posts