ప్రణాళిక ప్రకారమే వైకాపా అధినేత జగన్‌పై నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు.అక్టోబర్ 25న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడికి సంగతి తెలిసిందే. నిందితుడు శ్రీనివాస్ వెల్డర్‌గా, కేక్ మాస్టర్‌గా, కుక్‌గా పలు చోట్ల పనిచేశాడని సీపీ తెలిపారు. దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్ కోడికత్తికి సాన పట్టించాడని, దీన్ని అతడి సహచరులు కూడా చూశారని చెప్పారు. దాడి జరిగిన రోజు పక్కా ప్రణాళికతో ఇంటి నుంచి శ్రీనివాస్ ఉదయం 4.55 గంటలకే బయల్దేరాడని చెప్పారు. ఉదయం 8 గంటలకు హేమలత, అమ్మాజీ అనే మహిళలకు ఫోన్ చేసి ‘ఈ రోజు నన్ను టీవీలో చూస్తారు’ అని, అమ్మాజీతో ‘ఒక సంచలనం చూస్తారు’ అని పలుమార్లు శ్రీనివాస్ చెప్పాడని సీపీ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మాదిరిగా నా వద్దకు కూడా పీఏ అపాయింట్‌మెంట్ తీసుకొని రావాలని ఆమెతో చెప్పాడని తెలిపారు. ఉదయం 9గంటల సమయంలో రెస్టారెంట్‌లో కూడా కోడికత్తికి సానపెట్టాడని తెలిపారు. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్ చేశాడని, హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో వైకాపా నేత ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్ దాడి చేశాడని లడ్డా వెల్లడించారు. అక్టోబర్ 18నే దాడి చేయాలని శ్రీనివాస్ ప్రణాళిక రూపొందించినప్పటికీ అది సాధ్యం కాలేదని అయన అన్నారు.